వైసీపీ వల్లనే ప్రాజెక్టులు శిథిలం
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:31 PM
గత వైసీపీ పాలన వల్లనే రాయసీమ ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకున్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.
సీఎం చంద్రబాబును ఆరోపించడానికే బహిరంగ సభ
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి
మిడుతూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలన వల్లనే రాయసీమ ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుకున్నాయని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అలగనూరు రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించి కట్ట తెగిన చోట విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ రూ. కోటిన్నర నిధులు అలగనూరు రిజర్వాయర్‌కు ఇవ్వనందుకు ప్రస్తుతం మరమ్మతుకు రూ. 60 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నదని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ తెగిపోయినా గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పట్టించుకోక పోవడంతో అందులో చుక్కనీరు లేక రైతులు, మత్త్యకారులు అన్యాయ మైపోయారని అన్నారు. సీమ ప్రజలను వంచించేందుకు, సీఎం చంద్ర బాబును ఆరోపించడానికి లిఫ్టు ఇరిగేషన్ ప్రాంతంలో వైసీపీ సభ పెట్టిం దని మండిపడ్డారు. రాయలసీమలో కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రూ.220 కోట్ల నిధులను వైసీపీ లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. రాయలసీమ రైతుల బాగు కోరేందుకు ఇప్పటికైనా వైసీపీ నాయకులు సిద్ధేశ్వరం వద్ద తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం కోసం తమ పోరాటంలో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు వెంకటరామిరెడ్డి, స్వామిరెడ్డి పాల్గొన్నారు.