Share News

పట్టణాల్లో ప్రగతి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:00 PM

పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్‌ మాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) ప్రాజెక్టులో భాగంగా రూ.11,360 కోట్లతో చేపట్టే పట్టణాభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌ ద్వారా మంగళవారం శంకుస్థాపన చేశారు.

పట్టణాల్లో ప్రగతి
శంకుస్థాపన చేస్తున్న మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, కమిషనర్‌ చల్లా ఓబులేశ్‌

రూ.246 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

నగరం, మున్సిపాలిటీలకు కొత్తరూపు

రహదారులు, పార్కులు, డ్రైనేజీలు, డివైడర్లు, వీధి దీపాలకు ప్రత్యేక ప్రాధాన్యత

కర్నూలు నగరంలో రూ.153 కోట్లతో పనులు

స్థానిక ఎన్నికల వేళ పరుగులు పెడుతున్న అభివృద్ధి

కర్నూలు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్‌ మాన్యుటీ మోడల్‌ (హెచ్‌ఏఎం) ప్రాజెక్టులో భాగంగా రూ.11,360 కోట్లతో చేపట్టే పట్టణాభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌ ద్వారా మంగళవారం శంకుస్థాపన చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, గూడూరు నగర పంచాయతీ పరిధిలో రూ.246 కోట్లతో చేపట్టనున్న ప్రగతి పనులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు, స్థానికంగా మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, స్థానిక ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. నాలుగు పట్టణాల్లో ప్రగతి రూపురేఖలు మారబోతున్నాయి. రహదారులు, వీధిదీపాలు, డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌, పార్కులు, మురుగునీటి వ్యవస్థ (డ్రైనేజీలు) ఆధునికీకరణ వంటి పనులు చేపట్టనున్నారు. ఆధునిక వసతులతో నగరం, పట్టణాలను సుందరంగా తీర్చేదిద్దేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలు ఉన్నాయి. రోజురోజుకు పట్టణాలు విస్తరిస్తున్నా.. ఆ స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది. ‘పల్లె పండుగ’ పేరిట గ్రామాల్లో రహదారులు, మురునీటి కాల్వలు, వీధి దీపాలు.. వంటి పనులు చేపట్టింది. గుంతలమయంగా మారిన రహదారుల మరమ్మతులు, పునర్నిర్మాణం.. వంటి పనులు చేపట్టింది. తాజాగా నగర, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో కర్నూలు నగరంలో రూ.153 కోట్లు, ఆదోని పట్టణంలో రూ.50 కోట్లు, ఎమ్మిగనూరు పట్టణంలో రూ.31 కోట్లు, గూడూరు నగర పంచాయతీలో రూ.12 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి నోచుకోని పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడం, సీఎం చంద్రబాబు వర్చువల్‌గా భూమి పూజ చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే కర్నూలు నగరం సహా మూడు పట్టణాలు మరింత సుందరంగా, ఆధునికంగా రూపుదిద్దుకుంటాయి. కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ప్రధానంగా ఐదు విభాగాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. రహదారుల అభివృద్ధి, పార్కుల ఆధునికీకరణ, రహదారుల మధ్య డివైడర్లు నిర్మాణం, వీధిదీపాలు ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. అస్తవ్యస్తంగా మారిన మురుగునీటి వ్యవస్థ (డ్రైనేజీలు)ను ఆధునీకరించడంతో పారిశుధ్య సమస్యలకు చెక్‌ పెట్టబోతున్నారు. ప్రధాన కూడళ్లు, పార్కులు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి.

అక్కడ చంద్రబాబు.. ఇక్కడ స్థానిక నేతలు:

కర్నూలు నగర పాలక సంస్థ కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. పునర్విభజన తరువాత 68 వార్డులు ఏర్పడ్డాయి. రూ.153 కోట్లతో నగరంలో రోడ్లు, పార్కు లు, వీధిదీపాలు, డివైడర్లు, డ్రైనేజీల ఆధునికీకరణ పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. స్థానికంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, కమిషనర్‌ చల్లా ఓబులేశ్‌ శంకుస్థాపన చేశారు.

ఎమ్మిగనూరు పట్టణంలో రూ.31 కోట్లలో చేపట్టే పట్టణాభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కమిషనర్‌ గంగిరెడ్డి తదితరులు మౌలిక వసతుల కల్పన పనులకు శంకస్థాపన చేయనున్నారు. ఈ నిధులతో రోడ్డు, లైటింగ్‌తో పాటు వీవర్స్‌ కాలనీ మాచాని సోమప్ప పార్కులు, అయ్యప్పస్వామి దేవాలయం దగ్గర, మాలపల్లె రోడ్డులోని టీచర్స్‌ కాలనీ, ఎస్‌ఆర్‌ నగర్‌, మైనార్టీ కాలనీల్లో పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

ఆదోని పట్టణంలో రూ.50 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి శంకుస్థాపన చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడు, కమిషనర్‌ నయూమ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

గూడూరు నగర పంచాయతీలో రూ.12 కోట్లతో చేపట్టే వివిధ పట్టణాభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కమిషనర్‌ రమేశ్‌బాబు శంకుస్థాపన చేశారు. మాజీ వైస్‌ చైర్మన్‌ రామాంజనేయులు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ రేమట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల వేళ.. పట్టణాలకు సరికొత్త కళ:

పల్లెటూళ్లు, పట్టణాల స్థానిక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. నగర, పురపాలక సంఘాల్లో ఇప్పటికే వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసింది. పోలింగ్‌ కేంద్రాలు గుర్తించారు. ఓటర్లను ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గుర్తింపు సర్వే జోరుగా సాగుతోంది. ఈ నెల 26న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అక్టోబరు ఒకటిన తుది ఓటర్ల జాబితా సమర్పిస్తారు. వార్డుల రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అంటే.. వచ్చే ఆఖరులోగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే క్రమంలో అధికార కూటమి, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సహా వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే ఆశావహులు ఇప్పటికే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిని పూర్తి స్థాయిలో విస్మరిస్తే, కూటమి ప్రభుత్వం ప్రగతి పట్టాలు ఎక్కించేందుకు కృతనిశ్చయంతో ముందుకు కదులుతోంది. అందులో భాగంగా కర్నూలు నగరం సహా ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పట్టణాల్లో రూ.246 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. పట్టణాలకు సరికొత్త కళ రానుంది.

Updated Date - Sep 22 , 2026 | 11:00 PM