చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:05 AM
ప్రజా సమస్యలను ఆయా శాఖల అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
కలెక్టర్ రాజకుమారి
ఆత్మకూరు, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను ఆయా శాఖల అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ‘వన్ మంత్ - ఫోర్ విజిట్’లో భాగంగా ఆత్మకూరులోని ఎం.ఎం.ఫంక్షన్ హాల్‌లలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జేసీ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రీవెన్స్‌తో పాటు ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అక్కడ వరుసగా నాలుగు వారాల పాటు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను నేరుగా ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. అర్జీలు సమర్పించిన వారికి రశీదులు అందజేసి వచ్చే బుధవారంలోపు ఆయా గ్రామాల్లో అధికారుల బృందాలు పర్యటించి సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శ్రీశైలం ఐటీడీఏ పీవో పీవీఎస్ నాయుడు, ఆత్మకూరు ఆర్డీవో వెంకటశివ, డీఎస్పీ రామాంజీనాయక్, ఆయా శాఖల జిల్లా, డివిజన్, మండలాధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే విచ్చేసిన ప్రజానీకానికి, అధికార యంత్రాంగానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి భోజన సదుపాయాన్ని సమకూర్చారు.
ప్రత్యేక గ్రీవెన్స్‌తో మెరుగైన సేవలు: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్రమపద్ధతిలో సమస్యలను అధికారులు పరిష్కరిస్తారన్నారు.