Share News

సమస్యల బడి

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:06 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద ప్రారంభించిన తరగతి గుదల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేశారు.

సమస్యల బడి
ముత్యాలపాడు ప్రాథమిక పాఠశాలలో ఆగిన భవన నిర్మాణ పనులు

ఆగిపోయిన తరగతి గదుల నిర్మాణం

నిధులు ఇవ్వని గత ప్రభుత్వం, ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

చాగలమర్రి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద ప్రారంభించిన తరగతి గుదల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపేశారు. మండలంలో 20 పాఠశాలలకు రెండో విడత నాడు-నేడు కింద రూ.9.49 కోట్లు మంజూరయ్యాయి. పాఠశాలల హెచ్‌ఎంలు, కమిటీలు కలిసి పనులు ప్రారంభించారు. ముత్యాలపాడులో మూడు అదనపు గదులకు రూ.11.61 లక్షలు, గొడిగనూరులో మూడు భవనాలకు రూ.14.74 లక్షలు, మద్దూరులో మూడు భవనాలకు రూ.53 లక్షలు, బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు భవనాలకు రూ.36.45 లక్షలు, బాలికోన్నత పాఠశాలకు నాలుగు భవనాలకు రూ.49.88 లక్షలు, చిన్నవంగలి ఉన్నత పాఠశాలలో నాలుగు భవనాలకు రూ.30.20 లక్షలు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపేశామని హెచ్‌ఎంలు, కమిటీలు చెబుతున్నారు.

టీడీపీ హయాంలోనైనా పూర్తయ్యేనా?

టీడీపీ ప్రభుత్వం వచ్చాక నాడు-నేడును తొలగించి మనబడి-మన భవిష్యత్తుగా మార్చింది. అయితే అసంపూర్తి భవనాలను పూర్తిచేస్తారో లేదో నని ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంఈవో న్యామతుల్లను వివరణ కోరగా గత ప్రభుత్వంలో బిల్లులు మంజూరు కాకపోవడం వల్లే పనులు నిలిచి పోయాయని తెలిపారు. మంజూరైన 15 శాతం బిల్లుల వరకు పనులు చేశారు. అసంపూర్తిగా ఉన్న భవన పనుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

Updated Date - Mar 22 , 2026 | 12:06 AM