అవే అవస్థలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:15 AM
మండలంలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. పది రోజులు గడస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మండలంలో సుమారు పది పెట్రోల్ బంకులు ఉన్నా, పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో లేదు.
డీజిల్ కొరతతో రైతులు, పరిశ్రమల యజమానుల ఇబ్బందులు
వరి, మొక్కజొన్న కోతలు ఎలా అని రైతుల ఆవేదన
కొలిమిగుండ్ల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. పది రోజులు గడస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. మండలంలో సుమారు పది పెట్రోల్ బంకులు ఉన్నా, పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో లేదు. అయితే డీజిల్ కష్టాలు మాత్రం తీరడం లేదు. మంగళవారం మండల కేంద్రంలోని జమ్ములమడుగు సర్కిల్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో డీజిల్ లోడ్ వచ్చినా, కేవలం రెండు గంటల్లోనే అయిపోందని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో డీజిల్ కోసం వచ్చినవారు నిరాశతో వెనుదిరాగారు. మరోవైపు నెల్లూరు, ముంభై హైవేపై ప్రయాణించే వాహనాలు పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున బారులుదీరాయి. రెండు గంటల్లోనే డీజిల్ అయిపోదంటూ బంకును నిర్వాహకులు మూసివేశారు. దీంతో వాహనాలు, ఖాళీ క్యాన్లు, ట్యాంకులతో వచ్చినవారు వెనుదిరిగారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని రైతులు, పరిశ్రమ యజమానులు కోరుతున్నారు.
ఇంధన కొరత సృష్టిస్తే చర్యలు
చాగలమర్రి: పెట్రోల్ బంకుల యజమానులు డీజిల్, పెట్రోల్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం గ్రామంలోని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. డిజిల్, పెట్రోల్ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనదారులు, రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఇబ్బందులు కలిగించరాదని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ రాజారెడ్డి, పోలీసులు ఉన్నారు.
డీజిల్ కోసం తిప్పలు..
రుద్రవరం: గ్రామంలో డీజిల్ కోసం రైతులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం క్యాన్లతో రైతులు, వాహనదారులు క్యూలో నిలబడ్డారు. డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖరయ్య, ఎస్‌ఐ జయప్ప, ఏఈవో రాజు డీజిల్ పంపిణీని పర్యవేక్షించారు. ఒక్కో రైతుకు 30 లీటర్లు డీజల్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి వాహనం ప్రతి రైతుకు అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
నో స్టాక్ బోర్డ్ పెట్టవద్దు
బేతంచెర్ల: పెట్రోల్ బంకు యజమానులు నో స్టాక్ అని బోర్డులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగమణి హెచ్చరించారు. మంగళవారం మాట్లాడుతూ బేతంచెర్ల పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతుందన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ ఇవ్వడం పూర్తిగా నిషేధించామని, ఉల్లంఘిసేత బంకుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరత
అవుకు: మండలంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. రామాపురంలోని బంకులో ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేదు. మంగళవారం మధ్యాహ్నం ట్యాంకరు వచ్చింది, అయితే గంటల వ్యవధిలోనే డీజిల్ అయిపోయింది.
కోవెలకుంట్ల: పట్టణంలో అయిదు రోజుల నుంచి డీజిల్, పెట్రోల్ అందడం లేదు. అరకొరగా సరఫరా అవుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే
బంకులను సీజ్ చేస్తాం: ఆర్డీవో
బనగానపల్లె: పెట్రోల్, డీజల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే బంకులను సీజ్ చేస్తామని బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది నిఘా ఉంచామన్నారు. తహసీల్దార్లతో ఆర్డీవో మాట్లాడుతూ బనగానపల్లె సబ్‌డివిజన్ పరిధిలోని 35 పెట్రోల్ బంకుల్లో కావాల్సినంత సరఫరా ఉందన్నారు. కొందరు వాహనదారులు కొరత ఉందంటూ క్యాన్‌లు, డ్రమ్ముల్లో అధికంగా పెట్రోల్ పోయించుకోవడంతోనే సమస్య మొదలైందన్నారు. రెవెన్యూ సిబ్బందితో కలసి పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశామని, రెండు పెట్రోల్‌బంకుల్లో డీజల్ కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.