‘పులిహోర’ పెట్టిన చిచ్చు
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:09 AM
రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పులిహోరలో పురుగులు వచ్చాయన్న అంశం ఆర్‌యూ చిచ్చు పెట్టింది.
వార్డెన్ కుర్చీ కోసం తెరవెనుక రాజకీయమా?
అనుమతుల్లేకుండా వంట గదులు సీజ్
సీరియస్ అయిన కలెక్టర్
సెలవులోకి వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారి?
ఆందోళనలో విద్యార్థులు
తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : వీసీ
కర్నూలు అర్బన్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పులిహోరలో పురుగులు వచ్చాయన్న అంశం ఆర్‌యూ చిచ్చు పెట్టింది. బాలుర వసతి గృహం కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రొఫెసర్ల కోటరీ వ్యూహమా? వార్డెన్ కుర్చీ కోసం తెరవెనుక రాజకీయమా? అన్నది అనుమానాలకు దారి తీస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే డిమాండ్‌తో మొదలైన వివాదం .. ఇప్పుడు వార్డెన్ మార్పు, ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరా? అనేది క్యాంప్‌సలో చర్చకు దారి తీసింది.
ఫుడ్‌సేఫ్టీ అధికారులు రంగంలో దిగడం..
తుంగభద్ర హస్టల్‌లో వడ్డించిన పులిహోరలో పురుగులు కనిపించాయన్న ఫిర్యాదు తో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోని దిగడం ఈవివాదానికి కారణమైంది. కొందరు విద్యార్థి నాయకులు ఉద్యోగులను వెంట బెట్టుకుని క్యాంప్‌సలో వసతి గృహాలను తనిఖీలు చేయడం అనుమానాలకు దారి తీసింది. తనిఖీలు చేశాక వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయకపోగా స్వయంగా వారే వంట గదులను సీజ్ చేయడం సంచలనంగా మారింది.
బాధ్యులెవరు?
వాణిజ్య, ప్రైవేట్ వ్యాపారాల తరహాలో వసతి గృహాన్ని సీజ్ చేయడం నిబంధనలను ఉల్లంఘించడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆవెంటనే సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారి సెలవులో వెళ్లడం చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హాస్టల్‌లోని గదుల సీజ్ వ్యవహరం కథనాలు గందరగోళానికి దారితీశాయి. వాస్తవంగా ఆహార నాణ్యతలో లోపాలున్నాయా? ఉంటే బాధ్యులెవరు? అధికారుల పరిశీలన నివేదిక ఏమి చెబుతోంది? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తమకు అనుకూలమైన వ్యక్తికి..
మరో వైపు ప్రస్తుత వార్డెన్‌ను తొలగించి తమకు అనుకూలమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించేందుకు కొందరు ఉద్యోగులు, ప్రొఫెసర్లు విద్యార్థుల ఆందోళనలను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు సంబందించి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. విద్యార్థుల నిరసనల వెనుక నిజంగా ఆహార నాణ్యత సమస్య ఉందా? లేక పరిపాలన పదవుల కోసం జరుగుతున్న అంతర్గత పోరాటమా? అనేది తేలాల్సి ఉంది.
సమస్యలు పరిష్కరించేందుకు కృషి..
తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయలసీమ యూనివర్సిటీ వీసీ వెంకట బసవరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన రిజిస్ర్టార్ విజయకుమార్ నాయుడుతో కలసి వసతిగృహాల్లో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఏసమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు కృషిచేస్తామని భరోసా ఇచ్చారు. రిజిస్ర్టార్, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, పారిశుధ్యంపై చ్రర్యలు తీసుకోవాలని ఉద్యోగులను ఆదేశించారు.
మంత్రి నారా లోకేశ్..
పులిహోరు పురుగుల వ్యవహారంపై మంత్రి లోకేశ్ ఆరా తీసి కలెక్టర్‌ను నివేదిక కోరినట్లు సమాచారం. కలెక్టర్ ఫుడ్ సేఫ్టీ అధికారులను మందలించడంతో పాటు, వర్సిటీ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. వీసీ హాస్టళ్లను స్వయంగా సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించాల్సిన అవసరం ఉందన్న విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
వంట గది సీజ్ చేశారనేది అవాస్తవం
విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకే విశ్వవిద్యాలయంలో ఆహార భద్రతకు సంబందించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి తనిఖీలు చేశాం. లోపాలను సరిచేసుకోవాలని అధికారులకు సూచించాం. వంట గది సీజ్ చేశారనేది అవాస్తవం. సీజ్‌చేసే అధికారం మాకు లేదు. లోపాలను సరిదిద్దుకునేందుకు వారే తాత్కాలికంగా మూసివేశారు. - సతీష్, సహాయ ఆహార కల్తీ నియంత్రణాధికారి, కర్నూలు