సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:10 AM
సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ఉత్తమ కార్పొరేషన్‌గా కర్నూలును తీర్చిదిద్దుతా
నగర సుందరీకరణకు కట్టుబడి ఉన్నా
లెక్కలేనన్ని తప్పులు చేసిన గత ప్రభుత్వం
అన్నింటినీ సరి చేస్తున్నాం
44, 45 వార్డుల్లో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ విజయవంతం
కర్నూలు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో వార్డుల్లో తమ పార్టీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు ముందుంటారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే.. మౌర్య ఇన్‌లో నా ఆఫీస్ ఉంటుంది. ప్రజలు నేరుగా వచ్చి సమస్యలను చెప్పవచ్చు. వారం, పది రోజుల్లో పరిష్కారమయ్యేలా కృషి చేస్తా
- కర్నూలు ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు కల్చరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థలోని 44,45 వార్డుల పరిధిలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా నినాదంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి శుక్రవారం నిర్వహించిన సదస్సు విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. నగరంలోని రామలింగేశ్వర్‌నగర్‌లోగల మున్సిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నగరంలోని 44, 45 వార్డులకు చెందిన వివిధ కాలనీలకు చెందిన వందలాది ప్రజలు సదస్సుకు తరలివచ్చారు. తమ సమస్యలను మంత్రి టీజీ భరత్ దృష్టికి నేరుగా తీసుకువెళ్లారు. ఆయా సమస్యలను ఆలకించిన మంత్రి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పలు సమస్యలపై తక్షణం స్పందిస్తూ వారం పదిరోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కొన్ని స్వయంగా నోట్ చేసుకుని, వారం, పది రోజుల్లో మౌర్యఇన్‌లోని తన కార్యాలయంలో సంప్రదించాలని బాధితులకు సూచించారు. ఆయా వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలు, రోడ్ల ప్యాచింగ్ సమస్యలు, పార్కుల అభివృద్ధి, మంచినీటి సమస్య, ట్రాఫిక్ సమస్యలను సంబంధిత అధికారులను తక్షణం పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రజ్యోతి చొరవకు హ్యాట్సాఫ్
ప్రజలు ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు విన్నవించుకోకుండా, ప్రజల వద్దకే అటు ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను తీసుకువెళ్లి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సంస్థ వేదికను కల్పించడం అభినందనీయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ స్ఫూర్తిని భవిషత్తులోనూ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఒక్కరోజుతో వదిలివేయకుండా, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వినూత్న తరహాలో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఈ గ్రూప్‌లో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సంస్థను కూడా భాగస్వామ్యంగా చేసి సమస్యలను పరిష్కరించేలా ప్లాన్ చేస్తామన్నారు. తాను మంత్రి హోదాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కర్నూలు నగర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే ధ్యాస ఉంటుందన్నారు. తాను ఈ స్థాయికి వచ్చానంటే కర్నూలు ప్రజల ఆశీర్వాదమే కారణమన్నారు.
కిడ్స్ ఏరియాను అభివృద్ధి చేయాలి
వెంకట రమణకాలనీలోని రాజీవ్ నగర్ పార్కులో చిన్నారులకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో నివాసం ఉంటున్నాం. నగరంలోనే ఈ కాలనీకి మంచి గుర్తింపు ఉంది. 2008 సంవత్సరం నుంచి పార్కుల అభివృద్ధికి రూ.50 లక్షలు ఖర్చు చేశారు అభినందనీయం. అయితే రాజీవ్ నగర్ పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు ఆట పరికరాలను ఏర్పాటు చేయాలి.
- రాజేంద్ర, ఫారెస్టు అధికారి
మహిళలను డ్రైవర్లు వేధిస్తున్నారు
వెంకటరమణ కాలనీలోని నారాయణ పాఠశాల వద్ద పాఠశాలకు చెందిన వాహనాల డ్రైవర్లు మహిళలను వేధిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆ పాఠశాల వైపు మహిళలు వెళ్లాలంటే భయపడుతున్నారు. నారాయణ విద్యాసంస్థల వాహనాల డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. దీనిపై పోలీసులు చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ కల్పించాలి.
- సదాశివారెడ్డి
నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలను తక్షణ పరిష్కారానికి నగర పౌరులు పురమిత్ర యాప్‌ను సద్వియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ సదస్సులో సూచించారు. ఉచితంగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఈ యాప్‌ద్వారా తమ సమస్యలు నివేదిస్తే నిర్దేశిత సమయంలో వాటి కి పరిష్కారం సంబంధిత అధికారులు చూపాల్సిందేనని, ఈ యాప్‌లో పరిష్కారం కాని అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన డెస్క్‌ద్వారా పరిశీలిస్తున్నారని చెప్పారు. సమస్యలను అధికారులు దాటవేసే అవకాశం ఈ యాప్‌లో ఉండదని, కచ్చితంగా దానికి పరిష్కారం చూపాల్సిందేనని చెప్పారు.
కర్నూలు అభివృద్ధిలో భరత్ కృషి అభినందనీయం
కర్నూలు నియోజిక వర్గం అభివృద్ధిలో యువనేత టీజీ భరత్ కృషి అభినందనీయమని, అలాంటి చురుకైన నాయకుడి వల్ల భవిషత్తులో కర్నూలు మరింత అభివృద్ధి చెందుతుందని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం లభించినట్లు అయిందని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి రావడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు. ఆంధ్రజ్యోతి కర్నూలు యూనిట్ మేనేజర్ ఆకుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మధ్య వారధిగా నిలుస్తోందని అన్నారు.
- కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ఇంటి ఎదుట చెత్తను తగలబెడుతున్నారు
రామలింగేశ్వర్ నగర్ పార్కు ఎదురుగా మా ఇళ్లు ఉంది. పార్కులోని చెత్తను అంతా తీసుకుని వచ్చి డస్ట్‌బిన్‌లో వేస్తున్నారు. దానిని తరలించకుండా చెత్తను ఇక్కడే తగలబెడుతున్నారు. దీంతో చెత్తనుంచి పొగ వస్తుండటంతో మా అమ్మ ఆస్తమా పేషెంట్ ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో వృద్ధులు ఉన్నారు. పొగ రావడం వల్ల ఇంట్లో ఉండలేకపోతున్నాము. స్థానిక కార్పొరేటర్‌కు విషయం చెబితే రాత్రి సమయాల్లో చెత్తను తగలబెట్టమని ఉచిత సలహా ఇస్తున్నాడు. రాత్రి కాల్చిన...పగలు కాల్చిన పొగ మాత్రం వస్తుంది. చెత్తను దూరంగా తరలించాలి. ఇక్కడ కాల్చకుండా చర్యలు తీసుకోవాలి.
- సుధాకర్‌రావు
కాలువను పునరుద్ధరించాలి
పంప్‌హౌస్ నుంచి భగత్‌సింగ్ నగర్ వరకు పంప్‌హౌ్‌సలోని వేస్ట్‌వాటర్ వెళ్లేందుకు కాలువను నిర్మించారు. అయితే కాలువ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దానిని పూర్తిగా తీసేవేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో కాలువను పునరుద్దరించాలని కోరుతున్నాను. కాలువ శిథిలావస్థకు చేరడంతో అందులోనుంచి దుర్వాసన వెలజల్లుతోంది. దీని వల్ల అటువైపు వెళ్లే వాహదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన కాలువలను పునరుద్ధరించాలి.
- ప్రభాకర్
రోడ్డు నిర్మించాలి
శ్రీనగర్ కాలనీలో రోడ్డు నిర్మించాలి. కేవలం 100 అడుగుల రోడ్డు శిథిలావస్థకు చేరింది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కేసి కెనాల్ పక్కన ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశము ఉంది. పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదు. ఇప్పటికైన రోడ్డు వేయడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలి. - శేఖర్
గుంతలు తీసి వదిలేస్తున్నారు
తాగునీటి కనెక్షన్ల కోసం గుంతలు తీస్తున్నారు. అయితే కనెక్షన్ ఇచ్చిన వెంటనే వాటిని పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతి కాలనీలో ఇదే సమస్యల తీవ్రంగా ఉంది. గుంతలు తీస్తున్నారు. వాటిని పూర్తిగా మూయం లేదు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
- వెంకటే్‌ష
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ జె.రమణమూర్తి, మెడికల్ హెల్త్ అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్ చౌదరి, బ్యూరో గోరంట్ల కొండప్ప, ఏబీఎన్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి సుంకన్న, సర్క్యులేషన్, ఏడీవీటీ మేనేజర్లు సోమశంకర్ రెడ్డి, నంద్యాల గోపాల్, జనసేన నాయకుడు పవన్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీ నాయుడు, మాజీ కార్పొరేటర్ సుంకన్న, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి శరత్ తదితరులు పాల్గొన్నారు.