ప్రైవేట్.. టార్గెట్..!
ABN , Publish Date - May 12 , 2026 | 12:00 AM
ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు యాజమాన్యాలు టార్గెట్లు పెట్టాయి. అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం, జీతం ఉంటుందని, లేదంటే రెండు ఉండవని హెచ్చరిస్తున్నారు.
అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం, జీతం
లేదంటే కొలువు నుంచి తొలగిస్తాం
ఆందోళనలో ప్రైవేటు స్కూళ్ల ఉపాధ్యాయులు
కర్నూలు ఎడ్యుకేషన్, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు యాజమాన్యాలు టార్గెట్లు పెట్టాయి. అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం, జీతం ఉంటుందని, లేదంటే రెండు ఉండవని హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు టీచర్లు మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. ఎంతలా అంటే అడ్మిషన్ల కోసం పీక్కుతుంటున్నారు. టార్గెట్ పెట్టి మరీ పీడిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మండుటెండలో ఉపాధ్యాయులు రోడ్లపై తిరగాల్సి వస్తోంది. వేసవి సెలవుల్లో ఆదివారం కూడా పనిచేయాల్సి వస్తోంది. ఉద్యోగం ఉండాలంటే జీతం కావాలంటే అడ్మిషన్లు తీసుకురావాలంటూ వేధిస్తున్నారు. రోజూ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఎవరెవరిని కలిశారు. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు వారి అడ్రస్ నమోదు చేసి, ఇంటింటికి కరపత్రాలు పంచుతూ వారి స్పందన ఎలా ఉందో రిపోర్టు రాస్తే గానీ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. కాస్త అటుఇటు అయితే జీతాలు ఇవ్వలేమని బెదిరిస్తున్నట్లు తెలిసింది.. ప్రచారంలో కాస్త వెనుకబడి ఉంటే చాలు రాత్రి పూట సమావేశాలు పెట్టి యాజమాన్యం తిడుతున్నారు. ప్రతి టీచర్ అడ్మిషన్లు తేవాల్సిందే లేదంటే ఉద్యోగం, వేతనం అన్నీ వదులుకోవాల్సింది
7వేల మంది టీచర్లు..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 775 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈపాఠశాలలో 1.50 లక్షల మంది పైగా విద్యార్థులు 1నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థుల కోసం మొత్తం దాదాపు 7వేల మంది టీచర్స్ పనిచేస్తున్నారు. ఇందులో 40 శాతం కార్పొరేట్ పాఠశాలలున్నాయి. చిన్నాచితక ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ దెబ్బకు తట్టుకోలేక ఒక్కోటి విలవిల్లాడుతున్నాయి.
పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు..
రాబోయే విద్యాసంవత్సరానికి ముందు నుంచే కొత్త కొత్త ఆర్గనైజేషన్స్‌తో కర్నూలు నగరంలో పెద్దపెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు పలు కూడళ్లలో కట్టి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పీఆర్వో వలలో పడి వారు చెప్పే మాటలను నమ్మి మోసపోతున్నారు. పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపు రాకుండానే పాఠశాలలను ఏర్పాటుచేసి అడ్మిషన్లు నిర్వహిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎందులో చేర్చాలో తికమకపడుతున్నారు. కర్నూలులో విద్యా వ్యాపారంగా మారింది. ప్లే స్కూల్‌తో పాటు, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు వేలకు వేలు రూపాయలు అడ్మిషన్లు, ఫీజుల రూపాల్లో వసూలు చేస్తున్నారు.
విద్య వ్యాపారంగా మారింది
ప్రస్తుతం విద్య వ్యాపారంగా మారింది. కళాశాలలో పనిచేసే లెక్చరర్స్‌ను, పాఠశాలలో పనిచేసే టీచర్స్‌ను అడ్మిషన్లు తేవాలని యజమాన్యాలు టార్గెట్ ఇచ్చారు. ఇచ్చిన లక్ష్యాలను చేస్తేనే ఉద్యోగాలు ఉంటాయని ఒత్తిడి చేస్తున్నారు. అడ్మిషన్లు తేవాలనే విషయంలో టీచింగ్, నాన్ టీచింగ్ అనే బేధం లేదు. అందరూ అడ్మిషన్లు తేవాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు.
నాగరాజు, ఏఐఎస్‌ఏ, నేషనల్ కౌన్సిల్ మెంబర్, కర్నూలు
అరకొరగా వేతనాలు
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకురావాలని చెబుతుండటంతో క్వాలిటీ ఫ్యాకల్టీ లేదు. పది, ఇంటర్ పాసైన వారి ని టీచర్లుగా తీసుకొని వారికి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు. పాఠశా లల యాజమాన్యాల ఒత్తిడి భరించలేక ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్యలోనే అర్థాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగిపోతున్నారు. ప్రస్తు తం పట్టులేని వారు పని చేస్తున్నారు.
ఎస్.అబ్దుల్లా, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు