ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:14 PM
క్షణికావేశంలో తప్పులు చేసి జైలు జీవితాన్ని గడుపుతున్న ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకుని తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశంలో తప్పులు చేసి జైలు జీవితాన్ని గడుపుతున్న ఖైదీలు సత్ప్రవర్తన అలవర్చుకుని తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. పంచలింగాలలోని జిల్లా జైలును ఆయన శుక్రవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలనుద్దేశించి మా ట్లాడుతూ ప్రతి జైలులో ఒక అడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్లతో కూడిన విజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉంటుందని వారు ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించి త్వరగా బెయిల్ మంజూరుయ్యేలా కృషి చేస్తారన్నారు. ఈ సం దర్భంగా ఆయన ఖైదీలకు అందించే ఆహారం, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు ప్రతి వాయిదాకు ఖచ్చితంగా కోర్టుకు హాజర య్యేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులకు సూచించారు. జైలులో ఏవైనా సమస్యలు ఉంటే ఖైదీలు హెల్ప్‌లైన్ నెంబర్.15100కు, సమీప పో లీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, లీగల్ ఎయిడ్ క్లీనిక్ న్యాయవాది చిన్న రామ్‌దాసు తదితరులు పాల్గొన్నారు.