పోలీసులను మభ్యపెట్టి ఖైదీ పరారు
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:31 AM
జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న రాజశేఖర్ అలియాస్ పెద్ద అనే ఖైదీ పోలీసులను మభ్యపెట్టి రైలులో నుంచి పరారయ్యాడు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్యకేసులో జీవితఖైదు శిక్ష పడిన రౌడీషీటర్ రాజశేఖర్‌ను విశాఖపట్టణం నుంచి కడపకు రైలులో తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలోని గూడూరులో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
నెల్లూరు జిల్లాలో ఘటన
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అలర్ట్
నంద్యాల క్రైం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న రాజశేఖర్ అలియాస్ పెద్ద అనే ఖైదీ పోలీసులను మభ్యపెట్టి రైలులో నుంచి పరారయ్యాడు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్యకేసులో జీవితఖైదు శిక్ష పడిన రౌడీషీటర్ రాజశేఖర్‌ను విశాఖపట్టణం నుంచి కడపకు రైలులో తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లాలోని గూడూరులో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లాలో కూడా రాజశేఖర్ కోసం పోలీసుల పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన రాజశేఖర్ కొంతకాలం క్రితం నంద్యాలకు వలస వచ్చాడు. పట్టణం లోని రోజాకుంటలో నివసిస్తూ పలువురు రౌడీషీటర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. పట్టణంలో దందాలు చేసేవాడు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో పోక్సో కేసు కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో రెండో నిందితుడు. ఈ కేసులో అతడికి జీవితఖైదు పడింది. కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ పెద్ద మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుండటంతో చికిత్స నిమిత్తం విశాఖపట్టణంలోని మెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందిన రాజశేఖర్‌ను వైజాగ్ నుంచి కడపకు రైలులో తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయాడు. అతడు నంద్యాలకు వచ్చి ఉంటాడేమోనన్న అనుమానంతో ఇక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు.