పారిశుధ్యానికి ప్రాధాన్యమివ్వాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:20 AM
ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి అన్నారు.
జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి
కర్నూలు న్యూసిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో మండల పరిషత్ బడ్జెట్లు, స్వచ్ఛ రథాలు, సాసా కార్యక్రమాలపై సీఈవో ఎంపిడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2024-2025, 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మండల పరిషత్ బడ్జెట్, వాటి అనుమతులను సీఈవో సమీక్షించారు. తాగునీటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికా రులను ఆదేశించారు. మండలంలోని గ్రామ పంచాయితీల బడ్జెట్ వాటి అనుమతులపై తక్షణమే సమీక్ష నిర్వహించి నివేదికలు సేకరించాలన్నారు. పీఆర్ అడిషనల్ కమిషననర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో తడి, పొడి చెత్తను ఇంటింటికి వెళ్లి సేకరించే ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లోని ఘన వ్యర్థాల శుద్ది కేంద్రాల షెడ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటిని సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే సాసా దినోత్సవంలో ప్రతి గ్రామం, మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన మొక్కలను సమీపంలోని డ్వామా నర్సరీలు, అటవీశాఖ నర్సరీల నుంచి సేకరించి సిద్దం చేసుకోవాలని సూచించారు. డిప్యూటి సీఈవో వెంకటసుబ్బారెడ్డి, డీడీవోలు అశ్విని కుమార్, శివశంకర్, ఎంపిడీవోలు పాల్గొన్నారు.