సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:21 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు.
జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్
పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, గ్రామస్థులు
మంత్రాలయం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. అందులో భాగంగానే ‘ఒక్కనెల ఒక్క నియోజకవర్గం నాలుగు పర్యటన’లు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. శుక్రవారం హెచ్‌ఆర్‌బీ కల్యాణ మంటపంలో మంత్రాలయం ఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, తహసీల్దారు రమాదేవి ఆధ్వర్యంలో జేసీ నూరుల్ ఖమర్, డీఆర్‌వో వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నాలుగు మండలాల నుంచి పలుసమస్యలపై వినతులు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. చెట్నహళ్లిలో శ్మశాన స్థలానికి రోడ్డువేసి అక్కడే పూడ్చాలని జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదుచేశారు. అదే గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గం ప్రస్తుతం ఉన్న శ్మశానంలోనే పూడ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. తాగునీరు, విద్యుత్ కోతలు, గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కేవీపీఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు ఫిర్యాదు చేశారు. కల్లుదేవకుంటకి చెందిన రైతులు పొలాలకు వెళ్లే దారిని ఏర్పాటుచేయాలని కోరారు. ఎన్నో తరాలుగా సాగుచేసుకుంటున్న శ్రీమఠం భూములు రైతులకు హక్కులు కల్పించాలని కోరారు. రహదారులు, రెవెన్యూ పారిశుధ్యం, ఇంటి స్థలాలపై ఫిర్యాదులు అందజేశారు. వీటిని అక్కడే ఉన్న ఆయా శాఖలకు చెందిన అధికారులకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు వినతిపత్రాలను పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన ప్రతి సమస్యలను పరిష్కరించి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు మనోహర్, మహేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ నరసంహరెడ్డి, భూకొలతల ఏడీ మురళికృష్ణ, పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్, ఉద్యాన, వ్యవసాయశాఖ ఏడీలు రాజా కృష్ణారెడ్డి, మహమ్మద్‌ఖాద్రి, ట్రాన్స్‌కో డీఈ విశ్వశాంతి స్వరూప్, ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, ఏఈలుగోవిందు, తిమ్మరాజు, నియోజక వర్గంలోని ఆయా మండలాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.