Share News

గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:13 PM

గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రధాన్యమిస్తోందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం
జ్యోతిప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ తదితరులు

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రధాన్యమిస్తోందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 46 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయం, కొత్త ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పాత పాఠశాల భవనాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. జిల్లాలోని 9 ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన్‌ భవన్‌ ఏర్పాటు చేయాలన్న గిరిజన సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. పట్టణానికి సమీప ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించి గిరిజన్‌ భవన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీశైలంలోని మూసివేసిన ఎస్టీ హాస్టల్‌ భవనాన్ని స్వయంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులు తయారు చేసే వెదురు బుట్టలు, ఆభరణాలు, ఆకులతో తయారు చేసే విస్తరాకులు, కప్పులు, తేనె తదితర ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తే వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. పీఎం జన్‌మన్‌ పథకం కింద బైర్లూటీ, పాణ్యం కాలనీ, శ్రీశైలం మేకలబండ తదితర ప్రాంతాల్లో సుమారు 570 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు.

Updated Date - Aug 09 , 2026 | 11:13 PM