తాగునీటికే ప్రాధాన్యం!
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:32 PM
ఎల్‌నినో ప్రభావంతో వర్షాల రాకపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
పంటలకు మళ్లిస్తే చర్యలు
కాలువపై ఇంజనీర్ల నిరంతర పర్యవేక్షణ
టీబీపీ డ్యాం నుంచి 800 క్యూసెక్కులు విడుదల
ఎస్‌ఎస్ ట్యాంకులు నింపుకోవడానికి అధికారుల ప్రణాళిక
ఎల్‌నినో ప్రభావంతో వర్షాల రాకపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ ఏడు జలాశయాలు నిండుకోవడం లేదు. నీటి నిల్వలు ఖాళీ అయి ఎస్‌ఎస్ ట్యాంకులు ఎండిపోతున్నాయి. దాహంతో పల్లెజనం తల్లడిల్లుతున్నారు. బిందెడు నీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు. గ్రామీణులకు తాగునీరు అందించాలని తుంగభద్ర డ్యాం నుంచి టీబీపీ ఎల్లెల్సీ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమే.. ఎవరైనా సాగునీటికి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. నీటి వృథాను.. అక్రమ మళ్లింపులను అడ్డుకోవడానికి కాలువపై నిరంతర పర్యవేక్షణ కోసం పది కిలో మీటర్లకు ఒకరు చొప్పున ఇంజనీర్లను నియమించారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ కాలువకు శుక్రవారం 800 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు. ఎస్‌ఎస్ ట్యాంకులు పూర్తిస్థాయిలో నింపుకోవడానికి గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కర్నూలు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హోళగుంద మండలంలో ఏడు గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో సమ్మతగేరి సమగ్ర రక్షిత మంచినీటి పథకం (సీపీడబ్ల్యూఎస్) పథకం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం పర్యవేక్షణలో నిర్మించారు. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ)కు అనుసంధానంగా సమ్మతగేరి ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మాణం చేశారు. ఈ ఎస్‌ఎస్ ట్యాంక్ చుక్కనీరు లేకుండా పది రోజుల క్రితమే పూర్తిగా ఎండిపోయింది. కుళాయిలకు తాగునీరు సరఫరా లేకపోవంతో ఆ పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోళగుంద మండలంలో ఒక్కటే కాదు.. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాలు సహా 252 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. 12-13 లక్షల జనాభాకు శుద్ధి చేసిన తుంగభద్ర జలాలు అందించాలని టీబీపీ ఎల్లెల్సీ కాలువకు అనుసంధానంగా 26 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్), ఎస్‌ఎస్ ట్యాంకులు నిర్మించారు. జూలై మొదటి వారంలోనే ఎల్లెల్సీకి నీటి విడుదల చేస్తుండడంతో గతంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే.. ఈ ఏడాది ఎన్‌నినో ప్రభావం వల్ల కర్ణాటక రాష్ట్రం పచ్చిమ కనుమల్లో ఆశాజనకంగా వర్షాలు కురకపోవడంతో తుంగభద్ర డ్యాంకు 26.125 టీఎంసీలకు మించి వరద చేరలేదు. డ్యాంలో 40 టీఎంసీలు వరద చేరి, ఆశాజనంగా వరద కొనసాగితే (ఇన్‌ఫ్లో) తప్పా కాలువలకు సాగునీరు విడుదల చేసే అకాశాలు లేవు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు టీబీపీ బోర్డు అధికారులు కాలువలకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
సీఎం వస్తున్నాడని.. అధికారుల అప్రమత్తం
ఈ నెల 25న సంజీవని ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమం ప్రారంభోత్సవం కోసం సీఎం చంద్ర బాబు ఆలూరు నియోజకవర్గం ఆస్పరికి వస్తు న్నారు. ముఖ్యంగా ఆస్పరిలో కూడా తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆస్పరి రక్షత మంచినీటి పథకంలో భాగంగా ఆదోని మండలం నాగనాథన హళ్లి గ్రామం వద్ద ఎల్లెల్సీకి అనుబం దంగా నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి శుద్ధి చేసిన తుంగభద్ర జలాలు అందించాల్సి ఉంది. పది రోజులకు ఒకసారి కూడా తాగునీరు అం దడం లేదు. పైగా ఎస్‌ఎస్ ట్యాంక్ ఇప్పటికే అడుగంటి పోయింది. ఆలూరు నియోజకవర్గంలో మెజార్టీ గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. తమ వద్దకే వస్తున్న సీఎం చంద్రబాబును తాగునీటి సమస్యపై ప్రజలు గళమెత్తే అవకాశం ఉంది. దీనికి తోడు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. పశ్చిమ ప్రాం తం కన్నీటి కష్టాలపై ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రి కలో ఈ నెల 7న ‘గుక్కెడు నీళ్లు దొరికేనా..?’ శీర్షిక న వెలుగులోకి తెచ్చింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందించారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఎస్‌ఈ మనోహర్ సహా ఇంజనీర్లతో చర్చించారు. తుంగభద్ర డ్యాంలో చేరిన 26.125 టీఎంసీల్లో 1.50 టీఎంసీలు తాగునీటి కోసం విడుదల చేయా లని తుంగభద్ర ప్రాజెక్టు బోర్డుకు ఇండెంట్ పెట్టారు.
పొలాలకు మళ్లిస్తే కఠిన చర్యలు
తుంగభద్ర డ్యాం నుంచి ఏపీ, కర్ణాటక ఇండెంట్ కలిపి 800 క్యూసెక్కులు శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం 16-20 కిలో మీటరు వద్ద నీటి ప్రవాహం ఉంది. ఆంధ్ర సరిహద్దు ఆదోని మండ లం ఆనవాలు వద్ద 250.88 కిలో మీటర్ల వద్దకు చేరాలంటే మరో నాలుగైదు రోజులు పడుతుంది. వాస్తవంగా జిల్లా జలనవరుల శాఖ ఇంజనీర్లు 900 క్యూసెక్కులు ఇండెంట్ ఇచ్చారు. కాలువ భద్రత దృష్ట్య క్రమక్రమంగా పెంచుతున్నారు. శనివారం సాయంత్రంలోగా నాటికి 1,100 క్యూసెక్కులకు పెంచుతామని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణనాయక్ తెలిపారు. ఈ నీరు కేవలం తాగునీటి కోసమే విడుదల చేశారు. ఏ ఒక్కరు కూడా పొలాలకు మళ్లించరాదు. దొంగచాటున పంటలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గట్టి బందోబస్తు కోసం కాలువ వెంబడి ప్రతి పది కిలో మీటర్లకు ఒకరు చొప్పన ఇంజనీరును నియమించారు. రాత్రి పగలు ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కాలువపై పహరా పెట్టి నీటి చౌర్యం, వృథాను అడ్డుకుంటామని అధికారులు తెలిపారు. అయితే హాలహర్వి నుంచి గోనెగండ్ల వరకు కాలువ పొడవున వేలాది మంది రైతులు రాజకీయ అండదండలతో కాలువ గట్టు కింద పైపులు, పంపుసెట్లు ఏర్పాటు చేశారు. కంటికి కనిపించని ఈ జల చౌర్యాన్ని అడ్డుకొని ప్రజలకు దాహం తీర్చడంలో జిల్లా యంత్రాంగం ఏమేరకు సఫలం అవుతారో వేచిచూడాల్సిందే.