దిగుబడి భళా..ధర డీలా!
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:38 AM
ఈ రబీలో మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, హుస్సేనాపురం, నన్నూరు, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యలవాడ, పూడిచెర్ల, కన్నమడకల తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు.
ఈ ఏడాది పెరిగిన దిగుబడి.. పడిపోయిన ధర
శనగ రైతుల దుస్థితి
క్వింటం రూ.7వేలు ఇవ్వాలని డిమాండ్
ఓర్వకల్లు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఈ రబీలో మండలంలోని ఓర్వకల్లు, గుట్టపాడు, హుస్సేనాపురం, నన్నూరు, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యలవాడ, పూడిచెర్ల, కన్నమడకల తదితర గ్రామాల్లో దాదాపు 7వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు. తక్కువ పెట్టుబడి, నీటి వనరులు లేకున్నా పండుతుండటంతో చాలామంది రైతులు శనగకు మొగ్గు చూపారు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో పంట బాగా వచ్చింది.
గత ఏడాది తక్కువ దిగుబడి
గత ఏడాది ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్లు తక్కువ దిగుబడి వచ్చింది. అయితే మార్కెట్‌లో క్వింటం రూ.4,500 మాత్రమే ధర ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకోవలసి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
దిగుబడి ఉన్నా ధర లేదు
ఈ ఏడాది ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. అయితే మార్కెట్‌లో ధర లేదు. ప్రస్తుతం క్వింటం రూ.5,500 మాత్రమే ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి పెట్టామని, క్వింటం రూ.7వేల ప్రకారం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
గిట్టుబాటు ధర లేదు
నేను 5 ఎకరాల్లో శనగ సాగు చేశాను. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. అయితే ధర లేకపోవడంతో దిక్కుతోడం లేదు. క్వింటానికి రూ.7వేల మద్దతు ధరను ప్రకటించాలి - గోవిందరెడ్డి, రైతు
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి
ప్రభుత్వ శనగను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయాలి - మోహన్‌రెడ్డి, రైతు