పది పరీక్షలకు సిద్ధం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:15 PM
కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
జిల్లాలో విద్యార్థులు 35,791 మంది
రెగ్యులర్ విద్యార్థులు 33,796, ప్రైవేటు విద్యార్థులు 1,975 మంది
మొత్తం పరీక్ష కేంద్రాలు 160
విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
16 నుంచి పది పబ్లిక్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. కర్నూలు జిల్లాలో 552 పాఠశాలల నుంచి రెగ్యులర్ విద్యార్థులు 33,796 మంది కాగా, ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు 1975 మంది ఉన్నారు.
డివిజన్ల వారిగా వివరాలు : ఆదోని డివిజన్‌లో రెగ్యులర్ విద్యార్థులు 11,733 మంది, ప్రైవేటుగా 658 మంది కలిపి మొత్తం 12,391 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల కోసం 59 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తికొండ డివిజన్‌లో రెగ్యులర్ విద్యార్థులు 6,609 మంది, ప్రైవేటు విద్యార్థులు 1560 మంది కలిపి 6,974 మంది ఉన్నారు. వీరికి 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలు డివిజన్‌లో రెగ్యులర్ విద్యార్థులు 15,454 మంది, ప్రైవేటు విద్యార్థులు 952 మంది కలిపి 16,406 మంది ఈ విద్యార్థుల కోసం 71 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
జిల్లాలో 34 స్టోరేజ్ పాయింట్స్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను 34 స్టోరేజ్ పాయింట్స్ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రపరిచారు. పోలీసు సిబ్బంది కాపలా మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బాల బాలికల వివరాలు : కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే బాల బాలికలు మొత్తం 35,771 మంది ఉన్నారు. రెగ్యులర్‌గా పరీక్షకు హాజరయ్యే బాలురు 17,489 మంది కాగా, బాలికలు 16,307 మంది ఉన్నారు. ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు మొత్తం 1975 మంది కాగా, బాలురు 1433 మంది, బాలికలు 542 మంది ఉన్నారు.
2,521 మంది పరీక్షల నిర్వాహకుల నియామకం: పదో తరగతి పరీక్షల నిర్వహణకు మొత్తం 2521 మందిని అపాయింట్ చేశారు. ఈ సంఖ్యకు మరో 20 శాతం మందిని రిజర్వులో ఉంచుకునేందుకు విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసుకున్నారు. 160 పరీక్ష కేంద్రాలకు 160 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 160 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, 68 మంది కస్టోడియన్లు, 12 మంది రూట్ ఆపీసర్లు, మరో 12 మంది అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణకు అపాయింట్ చేశారు. అలాగే పరీక్షల ఇన్విజిలేటర్స్ 2109 మందిని నియమించారు. వీరితో పాటు జిల్లాలో 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించారు.
8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల గుర్తింపు: కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గార్గేయపురం, వసంత నగర్, ఉలిందకొండ, సి. బెళగల్‌లో ఏ, బీ కేంద్రాలు, దేవన కొండ, ఆస్పరిలో ఏ, బీ కేంద్రాలు గుర్తించారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి చూచి రాతలు మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పరీక్షలు పూర్తయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణం : పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి స్థాయిలో సౌకర్యాలు : కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఫర్నిచర్స్, గాలి, వెలుతురు, మరుగు దొడ్లు, తాగునీరు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ డా. సిరి ఆదేశించారు. అలాగే పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శా ఖ అధికారులకు సూచనలు చేశారు. రోజు పరీక్ష జరిగే సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కింద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలని సూచించారు. ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహకులు ఎవరూ కూడా పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు.
జిల్లాలో ఏ, బీ, సీ కేంద్రాల గుర్తింపు: కర్నూలు జిల్లాలో పది పరీక్ష కేంద్రాలను సౌకర్యాలను బట్టి ఏ, బీ, సీ కేంద్రాలుగా గుర్తించారు. జిల్లాలో ఏ-కేటగిరి పరీక్ష కేంద్రా లు, 59 బీ-కేటగిరి పరీక్ష కేంద్రాలు, 16 సి. కేటగిరి పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు. సీ. కేటగిరి పరిధిలోని పరీక్ష కేంద్రాలకు ఏ రోజు పరీక్ష ఆ రోజు ప్రశ్నాపత్రాలను వాహ నాల ద్వారా స్టోరేజ్ పాయింట్స్‌కు పరీక్ష కేంద్రాలకు పరీక్ష నిర్వాహకుల సాయంతో తరలించి పరీక్షలు నిర్వహిస్తారు.