వేదవతికి పూజలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:35 PM
పశ్చిమ కరువు ప్రాంత ప్రజల స్వప్నమైన వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి.
భూసార సర్వేకు శ్రీకారం
నిర్మాణ పనులకు సన్నాహం చేస్తున్న అధికారులు
కర్నూలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ కరువు ప్రాంత ప్రజల స్వప్నమైన వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. గురువారం జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్ బాషా, ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ శైలేశ్వర్, కాంట్రాక్టు సంస్థ మెగా ఇన్‌ఫ్రా ప్రతినిధులు భూసార పరీక్ష సర్వే పనులను ప్రారంభించారు. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 80వేల ఎకరాలకు సాగునీరు.. 196 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంగా వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు రూ.1948.80 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇటీవల ప్రాజెక్టుల సమీక్షలో సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులు చేపట్టాలని అధికారులు కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. 2028లో జూన్ ఆఖరిలోగా పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే గురువారం ఇరిగేషన్ అధికారులు మెగా సంస్థ ప్రతినిధులు వేదవతి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మొలగవల్లి జలాశయం భూములను పరిశీలించారు. అలాగే భూమి పటిష్టత కోసం అవసరమైన భూసార పరీక్షల నిర్వహణకు భూమి పూజలు చేసి ప్రారంబించారు.
ప్రభుత్వ లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తాం
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 36 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో వేదవతి ప్రాజెక్టును కూడా చేర్చింది. 2028 జూన్ ఆఖరిలోగా పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.
-కబీర్ బాషా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ, కర్నూలు