ప్రజా చైతన్యంలో ప్రజానాట్యమండలి
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:00 AM
ప్రజల పక్షాన నిలబడి, వారిలో చైతన్యం తెచ్చిన ఏకైక సంస్థ ప్రజానాట్యమండలి అని ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అన్నారు.
ప్రముఖ రచయిత తెలకపల్లి రవి
నిజాన్ని వెలికి తీసేవే నిజమైన కళలు- సినీ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు
ప్రారంభమైన 11వ రాష్ట్ర మహాసభలు
ఆకట్టుకున్న కళాకారుల ర్యాలీ
అలరించిన వీధి నాటకోత్సవాలు
కర్నూలు కల్చరల్, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజల పక్షాన నిలబడి, వారిలో చైతన్యం తెచ్చిన ఏకైక సంస్థ ప్రజానాట్యమండలి అని ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అన్నారు. శనివారం ప్రజానాట్యమండలి (పీఎన్‌ఎం) 11వ రాష్ట్ర మహాసభలు కర్నూలు నగరంలోని డైమండ్ ఫంక్షన్ హాలులో (సన్యాసిరావు, పెంచలయ్య నగర్) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదటి జిల్లా పీఎన్‌ఎం సీనియర్ నాయకుడు జీబీ మద్దిలేటి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కళాకారులు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సీనియర్ నాయకుడు జగన్ గీతాలాపన చేశారు. ప్రారంభ సభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్‌కుమార్ అధ్యక్షత వహించారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, రవీంద్ర విద్యాసంస్థల అధనేత జి. పుల్లయ్య అధ్యక్షోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా, జాతీయంగా అణచివేతకు గురవుతున్న ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడానికి కర్నూలులో పీఎన్‌ఎం మహాసభలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ముఖ్య వక్త, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఫాసిజాన్ని, ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పుట్టిందే ప్రజా నాట్య మండలి అని గుర్తు చేశారు. 1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలోనూ ప్రజా నాట్య మండలి పునఃజీవనం పోసుకుందని చెప్పారు. ఆ ప్రారంభ సమావేశానికి సినీ ప్రముఖుడు దాసరి, కృష్ణంరాజు, తాను హాజరైనట్లు గుర్తు చేశారు. ప్రపంచంపై గుత్తాధిపత్యం సాధించాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అట్లాగే దేశంలోని పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ అణచివేత ధోరణితో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా భావ ప్రకటన స్వేచ్ఛ, కార్మికుల, కర్షకుల హక్కుల కోసం పీఎన్‌ఎం ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే అది ప్రజా చైతన్య కళల ద్వారానే సాధ్యమని, ఆ దిశగా ప్రజా నాట్య మండలి ముందుకు పోతోందని అన్నారు. కళ కళకోసం కాదు, ప్రజల కోసం అని, సమాజ ప్రగతి కోసమని చాటి చెప్పిన ఘనత పీఎన్‌ఎం కళాకారులకు మాత్రమే ఉందని అన్నారు. దేశంలో ప్రశించే గొంతుకలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. మోదీ నియంతృత్వాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నించే పరిస్థిని నేడు ఢిల్లీలో యువత వల్ల ఏర్పడిందని అన్నారు.
నిజాన్ని వెలికి తీసే ప్రజా ఆయుధమే ప్రజా నాట్య మండలి
సినీ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు
సమాజంలో నిజాన్ని వెలికి తీసే ప్రజా ఆయుధమే ప్రజా నాట్య మండలి అని ప్రముఖ సినీ దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు అన్నారు. పీఎన్‌ఎం మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇలాంటి తరుణంలో నిజమైన కళలు ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కళారంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని మొత్తం పెట్టుబడిదారులు తమ కబంద హస్తాల్లో ఉంచుకొని కార్మికులు, రైతులు, కష్టజీవుల హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇలాంటి తరుణంలో నిజాన్ని వెలికితీసి ప్రత్యామ్నాయ సినిమాలు, నాటికలు, కళా ప్రదర్శనలు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. నిజాన్ని వెలికితీసే ఆయుధంగా ప్రజా నాట్యమండలి ఉంటుంది కాబట్టే తామంతా ఈ మహాసభల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ బి. శంకరశర్మ, సినీ క్యారెక్టర్ యాక్టర్ డాక్టర్ ఎన్. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో పీఎన్‌ఎం కీలక పాత్ర పోషిస్తోందని, నగరం మహాసభలకు వేదిక కావడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు. ఈ మహాసభల్లో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షడు పి. మంగరాజు, రాష్ట్ర కార్యదర్శి ఈ. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో భారీ ర్యాలీ....
ప్రజా నాట్య మండలి మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం నగరంలో కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గొరవయ్యలు, డప్పు కళాకారులు, గ్రామీణ కళాకారులు, కోలన్నలు, సంప్రదాయ వేషధారణలతో పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ర్యాలీని కొనసాగించారు. కొత్త బస్టాండు రోడ్డులోని కల్లూరు వక్కెరవాగు ప్రాంతం నుంచి ఈ ర్యాలీ కర్నూలు మార్కెట్ యార్డు వరకు చేరుకుంది. అక్కడ సఫ్దర్ హాస్మీ పేరుతో ఏర్పాటు చేసిన ఆరుబయలు థియేటర్ (గాదె సుబ్బారెడ్డి కళాప్రాంగణం)లో వీధి నాటకోత్సవాలు ప్రారంభించారు.