Share News

సేంద్రియ వ్యవసాయం చేయండి

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:09 AM

రైతులు సాంప్రదాయ, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి సూచించారు.

సేంద్రియ వ్యవసాయం చేయండి
రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ ఏ.సిరి

అంతర్‌ పంటలతో అధిక దిగుబడులు

సబ్సిడీపై యూరియా, ఉచితంగా కందులు

కలెక్టర్‌ ఏ.సిరి

తుగ్గలి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రైతులు సాంప్రదాయ, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి సూచించారు. శుక్రవారం తుగ్గలిలో కందుల ప్యాకెట్లను ఉచితంగా, సబ్సిడీపై యూరియా బస్తాలను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌లతో కలిసి కలెక్టర్‌ రైతులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. యూరియా ధర రూ.1457 ఉండగా.. ప్రభుత్వం రూ.1190 సబ్సిడీ అందించి కేవలం రైతులకు రూ.266.50లకే 50కేజీల యూరియా బస్తా అందజేస్తామన్నారు. అలాగే తుగ్గలి మండలంలో 244.8 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. 8.8 క్వింటాళ్ల కందుల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే.. రైతులు రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని అన్నారు. అట్లాగే అంతర్‌ పంటల వల్ల కూడా అధిక దిగుబడి ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:09 AM