Share News

ఉక్కపోత.. విద్యుత్‌ కోత

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:30 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక విద్యుత్‌ ఉత్పత్తి తగ్గడం, ఉక్కపోతతో వినియోగం పెరగడంతో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. రాత్రిళ్లు గంటతరబడి సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు.

ఉక్కపోత.. విద్యుత్‌ కోత
కొలిమిగుండ్లలో విద్యుత్‌ కోతలతో అలముకున్న చీకటి

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్‌ వినియోగం

లోడ్‌ రిలీఫ్‌ పేరుతో కోతలు విధిస్తున్న విద్యుత్‌ శాఖ

గ్రామాల్లో రాత్రిళ్లు అంధకారం

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో విద్యుత్‌ కోతలతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబరు నెల కూడా ఎండాకాలన్ని తలపిస్తోంది. ఓవైపు ఎండ, ఉక్కపోతతో అల్లాడుతుండగా విద్యుత్‌ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రాత్రివేళ అంధకారం

పగలంతా ఎండలతో అల్లాడిన రాత్రి సమయంలో విద్యుత్‌ కోతలు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. లైన్‌ రిలీ్‌ఫ(ఎల్‌ఆర్‌) పేరుతో విద్యుత్‌ అధికారులు గంటల తరబడి కోతలు విధిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఉక్కపోత, దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వినియోగానికి తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో కోతలు పెడుతున్నట్లు విద్యుత్‌ అధికారులు పేర్కోంటున్నారు. అధికారికంగా గంట మాత్రమేనని అంటుండగా, అనధికారికంగా మూడు గంటలకు పైగానే కోతలు విధిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

రుద్రవరం: విద్యుత్‌ ఎపుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు విద్యుత్‌ కోతలు, మరో వైపు ఉక్కబోతతో పాటు దోమలతో ఇబ్బందులు పడుతున్నట్లు వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ఏఈ రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ఉత్పాదన తక్కువగా వాడకం ఎక్కువగా ఉండటంతో కోతలు విధిస్తున్నామని, నాణ్యమైన విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆరు దాటితే.. అమావాస్య

శిరివెళ్ల: సాయంత్రం ఆరు గంటలు దాటితే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండటంతో మండలంలో అంధకారం కినిపిస్తోంది. రాత్రి సమయాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలపాటు విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ అధికారులు స్పందించి విద్యుత్‌ కోతలను ఆపాలని కోరుతున్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:30 AM