ముగిసిన పులి పోస్టుమార్టం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:33 AM
ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ పరిధిలో బుధవారం వెలుగు చూసిన పెద్దపులి మృతికి సంబంధించిన తదుపరి చర్యలను అటవీ అధికారులు పూర్తిచేశారు.
పలు అవయవాలు సేకరించి లాబొరేటరీకి తరలింపు
రిపోర్టు వచ్చాకే పులి మృతిపై స్పష్టత
ఆత్మకూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ పరిధిలో బుధవారం వెలుగు చూసిన పెద్దపులి మృతికి సంబంధించిన తదుపరి చర్యలను అటవీ అధికారులు పూర్తిచేశారు. గురువారం ఉదయాన్నే పెద్దపులి మరణించిన నాగలూటి రేంజ్, వరదరాజ స్వామి ప్రాజెక్ట్ సమీపంలోని ఇందిరేశ్వరం సెక్షన్‌లో గల వెస్ట్ బీట్‌లో గల అటవీ ప్రదేశానికి ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్, సబ్ డీఎ్‌ఫఓ బబితతో పాటు వైల్డ్‌లైఫ్ వెటర్నరీ డాక్టర్లు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ (ఎన్‌టీసీఏ) ప్రతినిధులు చేరుకున్నారు. పులి మరణించిన పరిసర ప్రదేశాలను అటవీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. వేటగాళ్లు వేసిన ఉచ్చులకు చిక్కి పులి మరణించిందా..? లేక విష ప్రయోగానికి గురైందా..? అన్న కోణంలో దర్యాప్తు చేశారు. అలాంటి ఆనవాళ్లు ఏవీ అక్కడ లభించలేదు. దీంతో పులి సహజ మరణం ు పొందినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. పులికి సంబంధించిన కాళ్ల గోళ్లు, దంతాలు, చర్మం తదితర అవయవాలన్నీ అక్కడే ఉండటంతో వేటగాళ్ల ప్రమేయం లేనట్లుగా ప్రాథమికంగా నిర్థారించారు. అయితే సహజ మరణానికి కూడా సరైన కారణాలు తెలుసుకోడానికి మృతదేహం నుంచి పలు రకాల అవయవాలను సేకరించి లాబొరేటరీకి పంపించారు. వీటి రిపోర్టు మరో 15రోజులుగా వచ్చే అవకాశం ఉంది. వాటినిబట్టి పులి మరణానికి సంబంధించిన వాస్తవాలు గుర్తించవచ్చునని అటవీ అధికారులు అంటున్నారు.
ఘటనా ప్రదేశంలో కళేబరం దహనం..
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ (ఎన్‌టీసీఏ) నిర్దేశించిన విధానం ప్రకారం మరణించిన పులికి ఘటన ప్రదేశంలోనే వైల్డ్‌లైఫ్ వెటర్నరీ డాక్టర్లచే పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేయించారు. అనంతరం పులి కళేబరాన్ని అక్కడే దహనం చేశారు.