Share News

పేదల బియ్యం పక్కదారి

ABN , Publish Date - May 25 , 2026 | 10:59 PM

వైసీపీ నాయకులకు ఏమాత్రం తీసిపోవడం లేదు.

పేదల బియ్యం పక్కదారి
మాధవరం చెక్‌ పోస్టు వద్ద బియ్యం లారీ సీజ్‌ చేసిన అధికారులు (ఫైల్‌)

వైసీపీ నాయకులకు తీసిపోని కూటమి నాయకులు

సరిహద్దులు దాటి కర్ణాటకకు ఉచిత బియ్యం

పత్తికొండ కేంద్రంగా ‘లేడీ డాన్‌’ హవా

నాలుగు నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్న కర్నూలు డాన్‌

ఆదోని, ఎమ్మిగనూరు నుంచి తరలిపోతున్న రేషన్‌ బియ్యం

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేదెవరు?

నేడు జిల్లా విజిలెన్స్‌ కమిటీ సమావేశం

వైసీపీ నాయకులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పేదల ఆకలి తీర్చాలని రూ.వేల కోట్ల భారాన్ని భరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నాయి. నాడు వాళ్లు అక్రమ రవాణా చేసి కోట్లు గడించారు. ఇప్పుడూ తామేమీ తక్కువ కాదంటూ కూటమి నాయకులు, వారి అండతో బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది. పేదవాడి కంచంలో బువ్వను అక్రమార్కులు లాగేసుకుంటున్నారు. కర్నూలు కేంద్రంగా ఓ డాన్‌ నాలుగు నియోజకవర్గాల్లో చక్రం తిప్పితే.. పత్తికొండ కేంద్రంగా ఓ లేడీ డాన్‌ హవా సాగిస్తోంది. ఆదోని, ఎమ్మిగనూరు కేంద్రంగా ఉచిత రేషన్‌ సరిహద్దులు దాటి కర్ణాటకకు తరలిపోతున్నాయి. అధికార కూటమి నాయకుల అండతో పెట్రేగిపోతున్న బియ్యం అక్రమార్కులకు అన్నమో రామచంద్రా..! అంటున్నా పేదల ఆకలికేకలు ఏమాత్రం వినిపించవు. అరికట్టాల్సిన నిఘా అధికారులు కళ్లు, చెవులు మూసుకున్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేదెవరు..? మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఇది.

కర్నూలు, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏపీ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణలో 1,233 నిత్యావసర సరుకుల పంపిణీ దుకాణాలు ఉన్నాయి. 6.86 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 23 లక్షల మంది పేదలకు ఒక్కొక్కరికి ఐదు కిలోలు చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 11 వేల మెట్రిక్‌ టన్నులు బియ్యం రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ బియ్యం రూపంలో సుమారుగా నెలకు రూ.50.60 కోట్లు చొప్పున ఏడాదికి రూ.607 కోట్లు ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. ఆకలితో అలమటించే నిరుపేదలకు ‘ఆహార భద్రత’ కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో ఏటా రూ.వేల కోట్ల ఆర్థిక భారాన్ని మోస్తూ ఉచిత, రాయితీ బియ్యం సరఫరా చేస్తున్నారు. పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. నాడు వైసీపీ పాలకుల అండతో అక్రమార్కులు పెట్రేగిపోయారు. తామేమి తక్కువ కాదన్నట్లు కూటమి ప్రభుత్వంలోనూ బియ్యం అక్రమార్కులు ఇష్టారాజ్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. అయితే.. ప్రభుత్వాలతో పాటు ప్రజా ప్రతినిధులు మారారే తప్ప పలు నియోజకవర్గాల్లో అప్పుడు ఇప్పుడు బియ్యం డాన్లతో హవా సాగిపోతోంది. దొరికితే దొంగలు.. లేదంటే దొరల్లా మాఫియా చెలరేగిపోతుంటే, నామ మాత్రపు కేసులతో అధికారులు సరిపుచ్చుకుంటున్నారు. కంటికి కనిపించని మహా కుంభకోణం ఇది. కర్ణాటక నుంచి మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు, అక్కడి నుంచి వివిధ మద్యం తయారి పరిశ్రమలకు పేదల బియ్యం సరఫరా అవుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

నాడూ.. నేడూ వారిదే ఇష్టారాజ్యం

కర్నూలు కేంద్రంగా వైసీపీ హయాంలో చక్రం తిప్పిన బియ్యం డాన్‌ ఇప్పుడు కూడా హవా సాగిస్తున్నారు. బుధవారపేట, ఓల్డ్‌ టౌన్‌లో ఉంటున్న మరో ఇద్దరు బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిపోయారు. రేషన్‌ డీలర్లు, ఇంటింటి నుంచి బియ్యం సేకరించే దళారుల ద్వారా రేషన్‌ బియ్యం సేకరించి తుంగభద్ర నది దాటిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చేరుస్తున్నారు. కర్నూలు, పాణ్యం, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఆ డాన్‌దే హవా. కొందరు అధికారులు, కూటమి ముఖ్యనాయకులు కొందరు ఆ డాన్‌కు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెల నాలుగు నియోజకవర్గాల నుంచి 75-100 లారీలు బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం.

పత్తికొండ మండలం హోసూరు కేంద్రంగా లేడీడాన్‌ ఒకరు బియ్యం అక్రమ రవాణాలో దూసుకుపోతున్నారు. వైసీపీ హయాంలోనూ, ఇప్పుడూ ఆ లేడీ డాన్‌దే హవా. డీలర్లు, ప్రత్యేకంగా నియమించుకున్న దళారుల ద్వారా సేకరించిన బియ్యం నెలనెల 10-15 లారీలు హోసూరు, మొలగవెళ్లి, ఆలూరు, హాలహర్వి మీదుగా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి తరలిస్తున్నారు. కూటమి నాయకులు అండతో లేడీడాన్‌ పెట్రేగిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఆదోని కేంద్రంగా కూటమి నేతల అండతో బియ్యం మాఫియా సాగిస్తున్న బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేదెవరు..? నాడు వైసీపీ హయాంలో చిన్నబాస్‌ కనుసన్నల్లో జరిగితే.. ఇప్పుడు ఆ స్థాయి నాయకుడి ఆధ్వర్యంలోనే పేదల బియ్యం సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. డీలర్లు, దళారుల నుంచి కిలో రూ.15-16లకు సేకరించి రహస్యంగా కర్ణాటకలోని శిరుగుప్ప పట్టణానికి తరలిస్తున్నారు. అక్కడ రీసైక్లింగ్‌ చేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మిగనూరు కేంద్రంగా ఇద్దరు ముగ్గురు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ మాజీ కౌన్సిలర్‌ సమీప బంధువు పేదల బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువుతున్నాయి.

నేడు జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం

కలెక్టర్‌ ఎ.సిరి అధ్యక్షతన మంగళవారం ఏపీ సివిల్‌ సప్లయీస్‌ జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. బియ్యం అక్రమ రవాణా అరికట్టే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారా..? పేదలకు ఇంటికి ఉచిత బియ్యం చేరేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? ఈ ప్రశ్నలకు జవాబు కోసం వేచిచూడాల్సిందే. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన తొలి విజిలెన్స్‌ కమిటీ తొలి సమావేశం ఇది. జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా ఈ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా..? షరా మాములే అన్నట్లు అధికారులు చెప్పింది విని.. నాలుగు మాటలు మాట్లాడి సరిపుచ్చుతారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నాం

- రాజా రఘువీర్‌, జిల్లా మేనేజరు, పౌర సరఫరాల శాఖ, కర్నూలు:

పేదలకు రేషన్‌ బియ్యం సక్రమంగా అందించే దిశగా నేడు జిల్లా స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం ఉంది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జనవరి నుంచి ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేసి 500 క్వింటాళ్ల బియ్యం సీజ్‌ చేశాం. 16 మందిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశాం. ఏ గ్రామంలోనైనా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా, అక్రమంగా నిల్వ చేసినా సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి దాడులు చేస్తాం.

జిల్లాలో రేషన్‌ కార్డులు, బియ్యం కోటా వివరాలు:

వివరాలు సంఖ్య

రేషన్‌ షాపులు 1,233

రేషన్‌ కార్డులు 6,86,206

లబ్ధిదారులు 23 లక్షలు

బియ్యం కోటా నెలకు 11,845 మెట్రిక్‌ టన్నులు

Updated Date - May 25 , 2026 | 10:59 PM