స్వీయ వ్యర్థాల నిర్వహణతో కాలుష్య నియంత్రణ
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:07 AM
స్వీయ వ్యర్థాల నిర్వహణతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ఏ.సిరి అన్నారు.
కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ఏ.సిరి
కర్నూలు న్యూసిటీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): స్వీయ వ్యర్థాల నిర్వహణతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి, కలెక్టర్ ఏ.సిరి అన్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో భాగంగా జ్యోతి డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో యాజమాన్యానికి ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-26పై అవగాహన కల్పించి ‘బల్క్ వేస్ట్ జనరేటర్’ నమోదు ప్రక్రియను కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదా యాలు తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సొంతంగానే ప్రాసెస్ చేసేం దుకు వ్యర్థాల ప్రొసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధ నలు-2026, ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో భాగంగా రోజుకు 100 కిలోలకు పైగా ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఫంక్షన హల్స్, విద్యాసంస్థలు బల్క్ వేస్ట్ జనరేటర్లుగా నమోదు కావాల్సి ఉందన్నారు. ఇటువంటి సంస్థలు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను సాధ్యమైనంత వరకు ప్రాంగణంలోనే కంపోస్టింగ్ బయోమీథనేషన లేదా ఇతర ఆమోదిత సాంకేతికతల ద్వారా శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని పేర్కొన్నారు. నిబం ధనలను పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్, నగర పాలక సంస్థకు ఉందని స్పష్టం చేశారు. కమిషనర్ మా ట్లాడుతూ వ్యర్థాలను మూలంలోనే శాస్త్రీయంగా నిర్వహించ డం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగర పరి శుభ్రతను మరింత మెరుగుపరచవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డా. ఎం.రఘు, డీఈఈ పవనకుమార్ రెడ్డి, శానిటరీ ఇనస్పెక్టర్ సూపర్‌వైజర్ రమేష్‌బాబు, ఇన్సపెక్టర్లు జిలానీ, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.