Share News

గ్రామాల్లో రాజకీయ వేడి

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:45 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికెషన్‌తో పాటు నామినేషన్లు ప్రారంభం కావడంతో మండలంలో రాజకీయ వేడి పెరిగింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావాహులు సిద్ధమవుతున్నారు.

గ్రామాల్లో రాజకీయ వేడి
చాగలమర్రి స్వర్ణ సచివాలయం

అభ్యర్థుల ఎంపిక కోసం ముఖ్య నాయకుల చర్చలు..

టికెట్‌ కోసం ఆశావహుల యత్నం

చాగలమర్రి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికెషన్‌తో పాటు నామినేషన్లు ప్రారంభం కావడంతో మండలంలో రాజకీయ వేడి పెరిగింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికలపై చర్చలు సాగుతున్నాయి. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావాహులు సిద్ధమవుతున్నారు. 19గ్రామ పంచాయతీలు, 15 ఎంపీటీసీ స్థానాలు, 182 వార్డులు, 202పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 41,383మంది ఓటర్లు ఉండగా, ఎస్టీలు 1,977, ఎస్సీలు 7,972, బీసీలు 21,697, ఇతరులు 9,382మంది ఉన్నారు. గ్రామా ల్లో రచ్చబండలు, టీ హోటళ్ల వద్ద రాజకీయ నాయకుల సమావేశాల వరకు అంతా ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది.

సర్పంచ్‌ పదవిపై ఆశావహుల గురి

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కంటే సర్పంచ్‌ పదవులపైనే పలువురు ఆశావాహులు ఎక్కువగా దృష్టి పెట్టారు. రాజకీయంగా పట్టు నిరూపించుకోవడంతో పాటు స్థానికంగా గుర్తింపుతెక్చుకునేందుకు సర్పంచ్‌ పదవీ కీలకమని భావిస్తున్నారు. దీంతో తమకు అనుకూలమైన రాజకీయ సమీకరణాలను సిద్ధం చేసుకుంటూ సంప్రదింపులు జరుపుతున్నారు.

ప్రతిపక్షంలోను పోటీకి సన్నద్ధత

మరోవైపు ప్రతిపక్ష వైసీపీ తరపున పోటీ చేసేందుకు కొందరు నాయకులు ఆసక్తి చూపుతున్నారు. మరి కొందరు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి ప్రభుత్వయంత్రాంగం, ఆర్థిక వనరులపరంగా అనుకూలత ఉంటుందనే అభిప్రాయంతో కొందరు వెనుకడుగు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. అయితే కొన్ని గ్రామాల్లో ప్రతిపక్ష నాయకులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ పోటీకి సిద్ధమవుతున్నారు.

అధికార పార్టీ వైపు ఆశావహుల చూపు

రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలిచే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టికెట్‌ కోసం నాయకుల వద్ద తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు మద్దతుగా నిలిచే నాయకులు, కార్యకర్తలను కూడగట్టుకుంటున్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:46 PM