Share News

గంట పాటు నిలిచిన పోలింగ్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:17 AM

నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని మాయలూరు గ్రామ పోలింగ్‌ కేంద్రం దాదాపు గంట పాటు పోలింగ్‌ నిలిచిపోయింది.

గంట పాటు నిలిచిన పోలింగ్‌
మాయలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి

మాయలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద జగత్‌ విఖ్యాత్‌రెడ్డి హల్‌చల్‌

నంద్యాల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని మాయలూరు గ్రామ పోలింగ్‌ కేంద్రం దాదాపు గంట పాటు పోలింగ్‌ నిలిచిపోయింది. గురువారం పోలింగ్‌ ప్రారంభమైన గంటకే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. గేటు బంద్‌చేసి, పోలింగ్‌ నిలిపేయాలని తన అనుచరులకు ఆదేశించారు. వారు గేట్‌బంద్‌ చేసి ఓటర్లు లోపలికి రాకుండా పోలింగ్‌ను నిలిపేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామిరెడ్డి అక్కడికి చేరుకొని వెళ్లిపోవాలని విఖ్యాత్‌రెడ్డిని కోరారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవటంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటును తోసుకొని ఓటేసేందుకు వెళ్తుండగా అతడి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు, విఖ్యాత్‌రెడ్డి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. మా అనుమతి లేకుండా మా అక్క ఫొటోతో ఎలా ప్రచారం చేస్తారు? అని సర్పంచ్‌ అభ్యర్థి భర్త శంకర్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. కొంత మంది పెద్దలు విఖ్యాత్‌రెడ్డిని నచ్చజెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

యల్లావత్తులలో ఉద్రిక్తత

రుద్రవరం: మండలంలోని యల్లావత్తుల కేంద్రంలో కౌంటింగ్‌ సందర్భంగా రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీలు చేరుకుని వాగ్వాదానికి దిగారు. అప్రమత్తమైన ఎస్‌ఐ మహ్మద్‌రఫి ఇరువర్గాలకు సర్ధి చెప్పి అక్కడినుంచి పంపించివేశారు.

Updated Date - Nov 27 , 2026 | 12:17 AM