పోలీసుల ఓవరాక్షన్!
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:35 PM
ప్రజలను కాపాడాల్సిన రక్షక్ష భటులే మితిమీరి ప్రవర్తిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణ పౌరుడిని చితకబాదిన మూడో పట్టణ రక్షక భటులు
అతడు చేసిన పాపం ఏమిటీ?
రోడ్డుపై వెళ్తుండగా ఎందుకు ఆపారని ప్రశ్నించడమేనా?
పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి మరీ చిత్రహింసలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
నంద్యాల క్రైం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలను కాపాడాల్సిన రక్షక్ష భటులే మితిమీరి ప్రవర్తిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ మధురై కోర్డు ఇటీవలే సంచలన తీర్పు ఇచ్చింది. అయినా పోలీ సులకు కన్నువిప్పు కలగలేదు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఒకటి నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. ఓ యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడమే అతడు చేసిన పాపమా.. తనను ఎం దుకు ఆపారని ప్రశ్నించడమే నేరమా? అదే పోలీసులకు తప్పు గా అనిపించిందా? దానికే వారికి ఆగ్రహం వచ్చి అతడిని జీపులో పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశారు. ఈఘటన పట్టణంలో సంచలనంగా మారింది. వివరాలు.. నంద్యాలలోని సాయిబాబానగర్‌కు చెందిన జమాల్ హుశేన్ అనే యువకుడు తన అన్న కుమార్తెను శనివారం రాత్రి రైలెక్కించి ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో పోలీసులు తారసపడ్డారు. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న అతడిని వాహనంలో వచ్చి న పోలీసులు అడ్డగించి నిలదీశారు. అతడు ఎందుకు అడ్డుకుం టున్నారని వారిని ప్రశ్నించాడు. దీంతో గొడవపడి ప్రశ్నించిన పాపానికి దాడిచేశారు. తమ వెంట వాహనంలో పోలీ సుస్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని బాధితుడు ఆరోపించారు. బంధువులు వెళ్లి వేడుకోవడంతో పోలీసులు విడిచిపెట్టారని తెలిపారు. దాడిలో గాయపడిన హుశేన్ శని వారం రాత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనవసరంగా తనపై దాడికి పాల్పడిన పోలీసులపై చర ్యలు దీసుకోవాలని బాధితుడు మీడియా ఎదుట వాపోయారు.
కానిస్టేబుల్‌పై దాడికి యత్నించాడు
సాధారణ విధుల్లో భాగంగా బెట్టింగ్ సమాచారంపై లాడ్జి చెకింగ్ నిర్వహించి తిరిగి వస్తుండగా మద్యం మత్తులో తూలుతూ వచ్చి పోలీసు వాహనంపై పడ్డాడు. ప్రశ్నించిన నేరానికి నానా దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో విధులకు ఆటంకం కలిగించాడు. బాధితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో కానిస్టేబుల్‌పై దాడికి కూడా దిగాడు. హుశేన్‌కు తోడుగా మరోవ్యక్తి కూడా సహకరించాడు. విధులకు ఆటంకం కలిగించినందునే ఇద్దరిపై కేసు నమోదు చేశాం. స్టేషన్ నుంచి పంపించాక ఆస్పత్రిలో చేరి పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అసత్య ప్రచారాలు నమ్మవద్దు.
-వేణుగోపాల్, త్రీటౌన్ సీఐ, నంద్యాల