Share News

వీల్‌చైర్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:33 AM

సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి చేపట్టిన వీల్‌ చైర్‌ యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు

వీల్‌చైర్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు
పార్వతీబాయిని అడ్డుకుంటున్న పోలీసులు

కర్నూలు క్రైం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి చేపట్టిన వీల్‌ చైర్‌ యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. ప్రీతిబాయి హత్య కేసు నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని ఆమె తల్లి, బందువులు బుధవారం సుంకేసుల రోడ్డులో ఉన్న శ్మశాన వాటిక నుంచి విజయవాడకు యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు పోలీసులను ముందుగానే అనుమతి కోరినా అనుమతులు నిరాకరించారు. ఆమె యాత్రకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రకటించారు. అయినా కూడా ఆమె వైసీపీ నాయకుల సహకారంతో బుధవారం ఉదయం ఈ యాత్ర మొదలు పెట్టారు. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌, వైసీపీ లీగల్‌ సెల్‌ నాయకురాలు రజిని ఈమె యాత్రకు వచ్చి సంఘీభావం తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకునియాత్రను అడ్డుకున్నారు. కూతురు మృతి చెందిన 9 ఏళ్లయినా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆమెకు న్యాయం చేస్తామని పలుసార్లు హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తున్నారనీ ఆమె ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఎన్నో సార్లు తమకు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని కోరారు. తన యాత్ర వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. పోలీసులు ఆమెను వేరే వాహనం ఎక్కించి తిరిగి ఇంటి వద్ద దింపారు.

Updated Date - Aug 20 , 2026 | 12:33 AM