Share News

సివిల్‌ వివాదంలో పోలీసుల జోక్యం

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:26 AM

నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సివిల్‌ వివాదంలో ఓ పోలీస్‌ అధికారి స్టేషన్‌కు పిలిపించి కొట్టడంతో అతని చేతికి బలమైన గాయందనే విషయం చర్చనీయాంశంగా మారింది

సివిల్‌ వివాదంలో పోలీసుల జోక్యం

పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆరోపణలు...!

ఓ వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి కొట్టినట్లు సమాచారం

నంద్యాల క్రైమ్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సివిల్‌ వివాదంలో ఓ పోలీస్‌ అధికారి స్టేషన్‌కు పిలిపించి కొట్టడంతో అతని చేతికి బలమైన గాయందనే విషయం చర్చనీయాంశంగా మారింది. పోలీస్‌ అధికారి లాఠీతో కొట్టడంతో తన చేతికి గాయమైందని బాధితుడు ఆరోపించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు... నంద్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సుమారు 3 సంవత్సరాల క్రితం పరిచయస్తురాలి వద్ద రూ 80వేలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితుడిని ఓ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది. అయితే ఇది సివిల్‌ వివాదానికి సంబంధించిన వ్యవహారమని, తాను ఈ విషయాన్ని కోర్టులోనే పరిష్కరించుకుంటానని బాధితుడు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీస్‌ అధికారి తనపై ఆగ్రహం వ్యక్తంచేసి లాఠీతో దాడిచేశారని, దీంతో చేతికి గాయమైందని బాధితుడు ఆరోపించినట్లు తెలిసింది. గాయపడిన అనంతరం బాధితుడు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వైద్య రికార్డులు, ఎక్స్‌రే విభాగంలో నమోదైన వివరాలపై కూడా ఆరా జరుగుతున్నట్లు తెలిసింది. అయితే మెడికో లీగల్‌ కేసు నమోదు అయిందా లేదా అన్నది అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందడంతో ఇంటలిజెన్స్‌, ఎస్‌బీ విభాగాలు ప్రాథమికంగా వివరాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బాధితుడి ఆరోపణలు, వైద్య రికార్డులు, పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, తదితర అంశాలను పరిశీలించిన అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 11 , 2026 | 12:26 AM