చేనేత సొసైటీపై విషప్రచారం
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:39 PM
పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేస్తున్నారని వైసీపీ విషప్రచారం చేస్తున్నదని, ఇది నిజం కాదని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
వస్త్రాల బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే విక్రయ కేంద్రాల విలీనం
సొసైటీ ఆస్తులతో సంబంధం లేదు
వైసీపీ ఆరోపణలను చేనేత కళాకారులు నమ్మొద్దు
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
ఎమ్మిగనూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేస్తున్నారని వైసీపీ విషప్రచారం చేస్తున్నదని, ఇది నిజం కాదని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆప్కోలో సొసైటీ విలీనం ఎప్పటికీ జరగదన్నారు. కేవలం మార్కెటింగ్ కోసమే ఆప్కోలో సొసైటీ విక్రయ కేంద్రాల విలీనం ప్రతిపాదన ఉందన్నారు. అయితే వైసీపీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక ఏకంగా సొసైటినే ఆప్కోలో విలీనం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేనేత సొసైటీ సభ్యులకు కూటమి ప్రభుత్వం మంచి చేయాలని ప్రయత్నిస్తే వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తూ చేనేతలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చేనేత కళాకారులకు సొసైటీలో అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. సొసైటీలో నాడు వేల సంఖ్యలో ఉన్న సభ్యులు నేడు 250 మందికి పడిపోవటానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. వైసీపీ ప్రచారాన్ని చేనేత కార్మికులు నమ్మవద్దని అన్నారు. ఈ సమావేశంలో కుర్ణి కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, నాయకులు ఎంబీ మహేష్, మాచాని శివశంకర్, బండా నరసప్ప, మాజీ కౌన్సిలర్లు సరోజమ్మ, స్వాతి, ముల్లా కలీముల్లాలు పాల్గొన్నారు.