Share News

పోక్సో నిందితుడు విధుల్లో..

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:32 PM

చట్టం పోక్సో నిందితుడి పని చేసిపెట్టింది. ఈ వ్యవ హారం బయటికి తెలిస్తే ఎలా? అనే జంకు గొంకు లేని బరి తెగింపునకు ఇది ఉదాహరణ.

పోక్సో నిందితుడు విధుల్లో..
శ్రీనివాస్‌

జైలు నుంచి రాగానే ఉద్యోగంలోకి

రిమాండ్‌ రిపోర్టును గోప్యంగా ఉంచిన పోలీసులు

ఫేక్‌ మెడికల్‌ సర్టిఫికెటు ఇచ్చిన విశ్రాంత వైద్యుడు

చట్టం పోక్సో నిందితుడి పని చేసిపెట్టింది. ఈ వ్యవ హారం బయటికి తెలిస్తే ఎలా? అనే జంకు గొంకు లేని బరి తెగింపునకు ఇది ఉదాహరణ. బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయి జైలు నుంచి బయ టికి రాగానే ఫేక్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌తో విధుల్లో చేరాడు. ఈఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. కేసు నమోదు, విచారణ, అరెస్టు, రిమాండు తదితర వివరాలేవీ అధికారులకు పంపకుండా పోలీసులు, నిందితుడు కలిసి ఆడిన డ్రామా నంద్యాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

నంద్యాల క్రైం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణ పరిధిలోని వైఎస్‌ నగర్‌లో నివసిస్తున్న అడ్డాకుల శ్రీనివాస్‌ నంద్యాల పట్టణం బొమ్మలసత్రంలోని డీఆర్‌డీఏ వెలుగు కార్యాలయంలో ఏపీ ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్‌ భార్య మద్దమ్మ అదే ప్రాంతంలోని కస్తూర్బా స్కూల్‌లో ఉద్యోగం చేస్తోంది. పట్టణానికి చెందిన ఓబాలికను గత నెల 7వ తేదీన శ్రీనివాస్‌ లైంగికంగా వేధించాడని బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనివాస్‌ను పోక్సో కేసు కింద అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కానీ ఈ పని గుట్టుచప్పుడు కాకుండా చేశారు. కేసు వివరాలను డీఆర్‌డీఏ వెలుగు కార్యాలయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు.

పోలీసులు గోప్యంగా ఉంచడానికి కారణాలేంటి?

వెలుగు ఏపీఎం శ్రీనివాస్‌పై పోక్సో కేసు, అరెస్టు వివరాలను సంబంధిత అధికారులకు పోలీసులు తెలియజేయకపోవడం వల్ల సదరు ఉద్యోగిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకో లేక పోయామని అధికారులు అంటున్నట్లు తెలుస్తోంది. నిందితుడి నుంచి భారీగానే ముడుపులు తీసుకుని కేసును తప్పుదోవ పట్టించేందుకు, ఉద్యోగం నుంచి సస్పెండ్‌ కాకుండా కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు.

భార్య సహకారంతో జైలు నుంచే శ్రీనివాస్‌ స్కెచ్‌..

ఏపీఎం అడ్డాకుల శ్రీనివాస్‌ పోలీసుల సహకారంతో జైలు నుంచే మొత్తం వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. రిమాం డులో ఉన్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పోలీ సులతో కుమ్మక్కైన నిందితుడు శ్రీనివాస్‌కు భార్య మద్దమ్మ కూడా సహకరించినట్లు తెలుస్తోంది. కార్యాలయంలో విధుల్లోనే ఉన్నట్లుగా... వైరల్‌ ఫీవర్‌ కారణంగా కార్యాలయానికి రాలేకపోతు న్నట్లు భార్య మద్దమ్మ ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ భక్తవత్సల రెడ్డి సహకారంతో ఓ ఫేక్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌ సంపాదించింది. పైసలిస్తే చాలు ఎన్ని రోజులకైనా మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి సిద్ధమైన వైద్యుడు ఏకంగా నిందితుడు జైలు ఉన్నన్ని రోజులకు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చాడు. కండిషన్‌ బెయిలుపై రిమాండు నుంచి బయ టకు వచ్చిన శ్రీనివాస్‌ ఎవరికీ ఏమీ తెలీదన్నట్లుగా విధుల్లో జాయిన్‌ అయ్యాడు. మెడికల్‌ సర్టిఫికెట్‌ను మాత్రం నిందితుడి భార్య మద్దమ్మ సంబంధిత కార్యాలయం ఉన్నతాధికారి ఇచ్చేసింది. పోక్సో కేసులో రిమాండుకు వెళ్లిన నిందితుడు ఏ మాత్రం భయం లేకుండా ఉద్యోగం చేస్తూ ఉండటంపై బాధితురాలి కుటుంబసభ్యులు ఆరా తీస్తే అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కండిషన్‌ బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు శ్రీనివాస్‌ విధుల్లో కొనసాగుతూనే వారానికోసారి రూరల్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంతకం చేసి వస్తున్నట్లు కూడా తెలిసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఈ కేసులో నిందితుడి అవసరాలన్నీ తీర్చి, కేసును తప్పుదోవ పట్టిం చారని, ఇదంతా నిందితుడిని కాపాడేందుకేనని బాధితులు, స్థాని కులు ఆరోపిస్తున్నారు. బాలికకు న్యాయం చేయకపోగా నిందితులను ప్రోత్సహిస్తూ కేసును నీరుగార్చేలా పోలీసులు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసు అధికారులు కనీసం ఇప్ప టికైనా కళ్లు తెరిచి ఇలాంటి పోలీసు అధికారులపై దృష్టి కేంద్రీకరించి బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కేసు వ్యవహారంపై బాధిత కుటుంబసభ్యులు ఎస్పీని కలవనున్నట్లు సమాచారం.

వివరణ: వెలుగు పీడీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. తమ ఉద్యోగి అరెస్టు అయినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పారు. పోలీసు శాఖ నుంచి తమకు ఎలాంటి రిమాండ్‌ కాని, ఫిర్యాదు కాని అందలేద న్నారు. పోలీసుశాఖ ద్వారా తమకు శ్రీనివాస్‌పై తమకు నివేదిక అందిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నంద్యాల రూరల్‌ సీఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా.. శ్రీనివాస్‌ డీఆర్‌డీఏలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి అనుకున్నామని చెప్పారు. సరైన సమాచారం ఈ ఉద్యోగి గురించి నాకు తెలియదన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 11:32 PM