సూక్ష్మ పరిశ్రమలకు పీఎంఎఫ్‌ఎంఈ పథకం అండ
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:51 PM
ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు పీఎంఎ్‌ఫఎంఈ పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు,
నంద్యాల రూరల్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు పీఎంఎ్‌ఫఎంఈ పథకం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు, సోమవారం నంద్యాల మండల పరిధిలోని అయ్యలూరు మెట్టలో పీఎంఎ్‌ఫఎంఈ పథకం ద్వారా ఏర్పాటు చేసిన స్వేచ్ఛా బుల్ డ్రివెన్ ఆయిల్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యక్తిగత ఔత్సాహికులు ఆహారశుద్ధి రంగంలో యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. 30 శాతం సబ్సిడీతో, గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. బ్యాంకుల సహకారంతో యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీ, బ్యాంకురుణాలతో పాటు యూనిట్ల స్థాపనకు అవసరమైన మార్గదర్శక సహకారం అందిస్తున్నట్లు వివరించారు. పీఎంఎ్‌ఫఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.