ప్లీజ్..! చిన్న విగ్రహాలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:53 PM
‘ఈ ఏడు ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి నిల్వలు భారీగా పడిపోయాయి.
7 లక్షల మందికి తాగు నీరు ముఖ్యం
ప్రజలకు కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘ఈ ఏడు ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. ఈ సమయంలో వినాయక చవితికి పెద్ద విగ్రహాలు పెట్టి తాగునీటి సమస్యను జఠిలం చేయకండి. ప్లీజ్.. చిన్న విగ్రహాలను ఏర్పాటు చేయండి..’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగరవాసులను విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఏడు లక్షల మంది ప్రలజ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని వినాయక నిమజ్జనం కోసం వినియోగించలేమని స్పష్టం చేశారు. సోమవారం నగర పాలక సమావేశ భవనంలో మున్సిపల్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కోసం నగర పాలక సంస్థ అన్ని విధాలా సిద్దంగా ఉందని, అయితే ప్రస్తుతం నీటి పరిస్థితుల కారణంగా కేసీ కెనాల్‌లోని వినాయక ఘాట్‌కు నిమజ్జ,నం కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. సుంకేసుల, గాజులదిన్నె తదితర జలాశాయాలు, ప్రాజెక్టుల్లో అదనపు నీరు అందుబాటులో లేవన్నారు. కేసీ కెనాల్‌కు ప్రధాన నీటి వనరులైన సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయని, ప్రస్తుతం ఉన్న అరకొర నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
అడుగంటిన నీటి నిల్వలు
గతంలో సుంకేసుల జలాశయంలో సుమారు 1.20 టీఎంసీలు, గాజులదిన్నె ప్రాజెక్టులో సుమారు 2.28 టీఎంసీలు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో సుమారు 4,410 మిలియన్ లీటర్లు అంటే 0.16 టీఎంసీల నీటి నిల్వలు ఉండేవన్నారు. మొత్తం సుమారు 3.64 టీఎంసీల నీటి లభ్యత ఉండేదని వివరించారు. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో సుమారు 1.561 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని, ఈ నీటిని రానున్న రోజుల్లో రోజుకు సుమారు 40 నుంచి 45 క్యూసెక్కుల చొప్పున సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సరఫరా చేస్తున్నామన్నారు. అక్టోబరులో తుంగభద్ర జలాశయం నుంచి సుంకేసులకు నీటిని విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదే విధంగా హంద్రీ-నీవా ప్రధానకాలువలో కూడా ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ఈ నెల 21 వరకే ఉంటుందన్నారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలందరూ విజ్ఞతతో వ్యవహరించి 1 నుంచి 1.5 అడుగుల లోపు ఉండే చిన్న మట్టి విగ్రహలను మాత్రమే ప్రతిష్టించి పూజించాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే పెద్ద విగ్రహలను తెచ్చుకున్న వారు వాటిని నిమజ్జనం చేయకుండా భద్రపరుచుకునేందుకు ఐదు ప్రత్యేకంగా మైదానాలను ఎంపిక చేశామన్నారు. గణనాథుని ఆశీస్సులతో పండుగలోపు వర్షాలు కురిస్తే, వర్షపు నీరు వృథాగా పోకుండా వినాయక ఘాట్ వద్ద నిల్వ చేసేందుకు అడ్డుకట్ట నిర్మిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో నగర పాలక ఎస్‌ఈ జే.రమణమూర్తి, నీటిపారుదల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ జి.శైలేశ్వర్, హంద్రీ-నీవా సర్కిల్-1 ఎస్‌ఈ రాజన్‌బాబు, హంద్రీ-నీవా డివిజన్-2 ఈఈ ఎన్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.