విన్నపాలు వినవలె..
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:37 PM
ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యమని ప్రకటించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిపోయాయి.
2026-27 బడ్జెట్‌లో ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
వేదవతి, ఆర్డీఎస్ పూర్తి చేయాలి
గుండ్రేవుల జలాశయంపై దృష్టి సారించండి
టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వాలి
నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు
కర్నూలు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యమని ప్రకటించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిపోయాయి. రాష్ట్ర ప్రజల సకల కష్టాలకు గత వైసీపీ పాలనే కారణమని ఇప్పటికీ చెప్పుకోవడమే కూటమి ప్రభుత్వానికి ఒక ఉద్యమంగా మారింది తప్ప జిల్లాలోని కీలక సమస్యల పరిష్కారం అడుగు ముందుకు కదల్లేదనే హేతుబద్ధ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పర్యటనకు నేడు రానున్న సీఎం దృష్టి సారించాల్సిన ముఖ్యమైన సమస్యలు ఇలా ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా చేపట్టిన వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల జలాశయం.. వంటి సాగునీటి ప్రాజెక్టుల గతి ఏమీ మారలేదు. గత వైసీపీ హయాంలో ఆగిపోయాయనుకుంటే.. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం నికరంగా ఆ ప్రాజెక్టు పనులను నేల మీద ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకుపోలేదు. గత టీడీపీ కాలంనాటి టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి.. గత వైసీపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు.. కూటమి వచ్చి ఇంతకాలమైంది కదా.. తమ హయాంలో చేపట్టిన టిడ్కో ఇండ్లను ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తమకు ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్రశ్న లబ్ధిదారులను వేధిస్తోంది. పశ్చిమ పల్లెసీమల్లో వలసలను నివారిస్తామనే వాగ్దానాలు చేసిన ప్రభుత్వం ఆ దిశగా నిర్దిష్టంగా ఏదైనా చేయడానికి ఇంత సమయం సరిపోలేదా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇట్లా ఉండగా రాజముద్రతో పాసు పుస్తకాల పంపిణీకి ముఖ్యమంత్రి జిల్లాకు నేడు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలను, వాటి పరిష్కారానికి గతంలో చేసిన వాగ్దానాలను గుర్తు చేసుకొని సీఎం పరిష్కరించాల్సి ఉంది.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా జలాలు మళ్లించే జలవనరుల హబ్‌గా ఉమ్మడి కర్నూలు జిల్లా ఉంది. కానీ రాయలసీమ సంగతి అటుంచి, కనీసం జిల్లా రైతులకు కూడా సాగునీరు అందడం లేదు. వర్షాధారంపై ఆధార పడుతున్నారు. ఏటేటా కరువు.. వలసలే శరణ్యం అయ్యాయి. కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా వందల టీఎంసీలు కడలిపాలు అవుతున్నాయి. ఆ నీటిని ఒడిసి పట్టి కరువు నేలలో సిరులు పండించే అవకాశాలు మెండుగా ఉన్నా..ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల రంగంలో ఏ దుస్థితి ఉన్నదో అదే నేటికీ యథాతథంగా కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు రూ.1,450 కోట్ల నిధులు ఇవ్వాలని ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం కనీసంగా పట్టించుకోలేదని చెప్పడానికి జిల్లా నీటిపారుదల రంగంలోని దుస్థితే సజీవ ఉదాహరణ.
వేదవతి.. ఆర్డీఎ్‌సకు నిధులు పనులు చేపట్టాలి:
జిల్లా పశ్చిమ ప్రాంత పల్లెసీమలు కరువు.. వలసలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారాయి. వానోస్తే పంటలు.. లేదంటే పస్తులే. రాష్ట్ర విభజన తరువాత నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగు, 195 గ్రామాలకు తాగునీరు అందించే వేదవతి ప్రాజెక్టు రూ.1,942 కోట్లతో, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు .1,985.42 కోట్లతో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు శ్రీకారం చుట్టారు. టెండర్లయ్యాక పనులు మొదలు పెట్టే సమయానికి అప్పటి పదవీ కాలం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది సరే.. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు కావస్తున్నా అంతకముందు పనులు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఉంది. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో వేదవతి చేర్చారే తప్ప అడుగు ముందుకు పడలేదు. ఈ నెల 14న ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనైనా నిధులిచ్చి భూ సేకరణ, నిర్మాణాలు మొదలు పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా రాయలసీమ జీవనాడి శ్రీశైలం డ్యాం శాశ్వత మరమ్మతులపై బడ్జెట్‌లో ప్రత్యేక ప్రధాన్య ఇవ్వాలి. ఇప్పటికే అప్రూవల్ ఇచ్చిన రూ.208 కోట్లు, నంద్యాల జిల్లాలో గోరుకల్లు, అలగనూరు జలాశయాలు ఆనకట్టలు శాశ్వత మరమ్మతులకు దాదాపు రూ.80 కోట్లు అవసరం ఉంది. ఈ బడ్జెట్‌లో కేటాయించాలి. గోనేగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు 5.50 టీఎంసీలకు సామర్థ్యం పెంపు పనులు పూర్తి చేసేందుకు రూ.92 కోట్లు ఇవ్వాలి. కేసీ కాలువ, సుంకేసుల బ్యారేజీ ఆధునికీకరణకు రూ.300 కోట్లు ఇవ్వాలి. గత వైసీపీ పాలనలో శిథిలమైన రాయలసీమ ప్రాజెక్టులను పునరుద్ధరించడమే లక్ష్యమని ప్రకటించుకుంటున్న ప్రజాప్రతినిధులు సీఎం ద్వారా బడ్జెట్‌లో జిల్లా జలాశయాలకు ఎలాంటి చోటు కల్పిస్తారు? అని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు.
సీమ ‘గుండె’రేవులపై దృష్టి పెట్టాలి:
జిల్లాలో ప్రవహించే తుంగభద్ర నది ద్వారా ఈ ఏడాది 405 టీఎంసీలు కృష్ణా నదికి, తద్వారా సముద్రానికి వదిలేయక తప్పలేదు. అందులో పది శాతం అంటే 40 టీఎంసీలు ఆపుకోగలిగినా కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో సస్యశ్యామలం అవుతాయి. వరద నీటిని ఒడిసిపట్టి ఆపుకునే జలాశయం లేదు. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షలకు సాగునీరు అందించే కేసీ కాలువ 39.9 టీఎంసీలు కేడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం కేటాయించారు. తుంగభద్రలో వరద ఉంటే తప్ప ఆ నీటి వాటా తీసుకోలేని పరిస్థితి ఉంది. కేసీ కాలువకు నీటిని మళ్లించే సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలే. కేసీ వాటా జలాలను సుంకేసుల బ్యారేజీ ఎగువన 20 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి వీలుగా గుండ్రేవుల జలాశయం డిజైన్ చేశారు. 2019లో నాటి సీఎంగా చంద్రబాబు రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్‌టీ నంబరు.153 జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అంతర్ రాష్ట్ర సమస్య అంటూ అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గుండ్రేవుల ఎండమావి అయింది. ఈ ప్రాజెక్టుపై సరిహద్దు రాష్ట్రం తెలంగాణ కూడా సానుకూలంగానే ఉందని ఆ రాష్ట్ర రైతులు అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు ఎంత సాన్నిత్యం ఉన్నదీ ఇటీవల అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత చర్చలు జరుగుతున్న సందర్భంలో గుండ్రేవుల కోసం ఆ ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్మాణాన్ని ముందుకు తీసుకపోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పంటల కాలువలు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు:
హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ (ఆర్‌బీసీ), ఎడమ కాలువ (ఎల్‌బీసీ)ల కింద 61,394 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్ రివెట్మెంట్ సహా కుడి, ఎడమ ప్రధాన కాలువలు, పంట కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందని దైన్యపరిస్థితి ఉంది. అసంపూర్తి పనులు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ.270 కోట్లు నిధులిచ్చి కరువు రైతుల కన్నీళ్లు తుడవాలి. రూ.3 వేల కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా కాలువ విస్తరణ చేయడం అభినందనీయమే. అసంపూర్తి పంట కాలువలు పూర్తి చేసి పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 45 వేల ఎకరాలకు సాగులోకి తీసుకురావాలి.
పేదలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలి:
ఉమ్మడి జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం ఏపీ టిడ్కో కింద 52,318 ఇళ్లు మంజూరు చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 21,038 ఇళ్లు రద్దు చేసింది. 31,289 ఇళ్లలో 23,645 ఇళ్లు 90-100 శాతం టీడీపీ ప్రభుత్వంలో పూర్తయ్యాయి. 7,007 ఇళ్ల లబ్ధిదారులకు తాళాలు అప్పగించారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లలో చేరలేదు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో 16,595 ఇళ్లు, నంద్యాల, డోన్, ఆళ్లగడ్డలో 7,050 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా.. మౌలిక వసతులు లేవు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏ చిన్న చిన్న పనులు చేయలేదో, ఆ పనులను కూటమి ప్రభుత్వం కూడా ఈ ఇరవై నెలలలో చేయలేదు. ఈ నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే టిడ్కో ఇళ్లు పేదలకు అప్పగించేలా చర్యలు చేపట్టాలి.
జిల్లాను వెంటాడే మరిన్ని సమస్యలు:
కర్నూలు సర్వజన వైద్యశాల. ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీ భనవాలు నిర్మాణాలు రూ.450 కోట్లతో, ఆదోని మెడికల్ కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాలు రూ.480 కోట్లతో చేపట్టారు. వివిధ దశల్లో నిర్మాణాలు ఆపేశారు.
రాయలసీమ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 192 ఎకరాల్లో జగన్నాథగట్టుపై నిర్మాణం చేపట్టారు. రూసా నిధులు రూ.20 కోట్లు ఇచ్చారు. పునాదులతో పనులు ఆగిపోయాయి.
డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం శాశ్వత భవనాలు ఓర్వకల్లు విమానాశ్రయం పక్కనే 144.92 ఎకరాల విస్తీర్ణంలో ఫేజ్-1 కింద రూ.18 కోట్లతో గత టీడీపీ ప్రభుత్వంలో చేపడితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆపేశారు. ఐదు రోజుల క్రితం మంత్రి టీజీ భరత్ రూ.కోటి సొంత నిధులతో అసంపూర్తి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తిస్థాయి వర్సిటీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలి.
జగన్నాథగట్టుపై 52 ఎకరాల్లో రూ.80 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ‘క్లస్టర్ యూనివర్సిటీ’ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి.
ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత పక్కా భవనాలు నిర్మాణం, కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ హామీలు అమలు చేయాలి.
కర్నూలు-ఆలూరు వయా కోడుమూరు, కోడుమూరు-ఎమ్మిగనూరు వయా గోనేగండ్ల ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా ఆధునికీకరణ చేసి పశ్చిమ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపరిచాలి.