Share News

నీళ్లివ్వండి.. మహాప్రభో..!

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:26 PM

కష్టాలు, సమస్యల గగ్గోలుతో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం గందరగోళంగా కొనసాగింది.

నీళ్లివ్వండి.. మహాప్రభో..!
ఎమ్మెల్యేల మధ్య రసాభాస

జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, సభ్యుల ఆందోళన

తాగు నీటి సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కష్టాలు, సమస్యల గగ్గోలుతో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం గందరగోళంగా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో కరువు కాటకాలతో అల్లాడిపోతున్న పశ్చిమ ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేయాలని జడ్పీటీసీ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా-పారిశుధ్యం, విద్యుత్‌, విద్యాశాఖల అంశాలపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు ఏ.సిరి, రాజకుమారి, ఆదోని, ఆలూరు ఎమ్మెల్యేలు పార్థసారథి, బుసినే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూధన్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, డీసీసీఎం చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, రాష్ట్ర రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ సావిత్రి, ఉమ్మడి జిల్లాల జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని 8 మండలాలు కోడుమూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, కౌతాళం, తుగ్గలి, నందవరం, కొలిమిగుండ్ల, నందికొట్కూరులో సుజల స్రవంతి కింద మదర్‌ ప్లాంట్లను రూ.14 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కస్తూర్బా పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రతి మండలానికి ఒక మోడల్‌ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంద రోజుల ప్రణాళికలో ఎలాంటి పర్సెంటేజీ పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సర్వసభ్య సమావేశంలో కూటమి ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, జడ్పీటీసీల అభ్యర్థన మేరకు ఉమ్మడి జిల్లాలో శాశ్వత తాగునీటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఏకైక తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ జీవి. రమణారెడ్డి, జడ్పీ డిప్యూటీ వెంకటసుబ్బారెడ్డి, జడ్పీ పరిపాలన అధికారులు జితేంద్ర, మురళీ మోహన్‌రెడ్డి, బసవశేఖర్‌, సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం

సర్వసభ్య సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, జడ్పీటీసీలకు మాటల యుద్ధం నెలకొంది. సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆదోని ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంపై కావాలనే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీంతో జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. సభలో మాట్లాడే హక్కు నాకుందని ఆదోని ఎమ్మెల్యే అన్నారు. ‘చిలక పంచాంగం చెప్పకుండా.. కేవలం శాఖ గురించి మాట్లాడు..’ అని ఆస్పరి జడ్పీటీసీ దొరబాబు ఎమ్మెల్యేను ఎద్దేవా చేశారు. దీంతో ఆ జడ్పీటీసీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఎలా మాట్లాడాలో నువ్‌ చెప్తావా..’ అంటూ జడ్పీటీసీ తిరుగు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో జడ్పీటీసీలు, ఆదోని ఎమ్మెల్యేకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంతలో చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి కలగజేసుకుని కేవలం సమావేశంలో ఏజెండా ప్రకారం ఉన్న శాఖలపై మాత్రమే చర్చించాలన్నారు. తనకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే చైర్మన్‌ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి అసభ్యకర రీతిలో మాట్లాడిన తీరుపై ఎమ్మెల్యే విరూపాక్షి, జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ సమయంలో జడ్పీ చైర్మన్‌ కలుగజేసుకుని వాగ్వాదాన్ని సద్దుమణిగించారు.

కర్నూలు కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ... గ్రామీణ నీటి సరఫరా విభాగానికి సంబంధించి జిల్లాలో ఉన్న 33 సీపీడబ్ల్యూఎస్‌ పథకల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు రూ.59.7 కోట్లు, ఎస్‌ఎస్‌ ట్యాంకుల మరమ్మత్తులకు రూ.16 కోట్లు, ఫిల్డర్‌ మార్పులకు రూ.6.6 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు నీటి సరఫరా పైప్‌లైన్‌ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ శాఖకు సంబంధించి ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులను అక్టోబరులో బర్తీ చేస్తామన్నారు. వలస కుటుంబాల పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా ఈ ఏడాది 100 సీజనల్‌ హస్టళ్లను వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు.

నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ... ఈ-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు సరిపడా ఎరువులు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. దొర్నిపాడు మండలంలో శిథిలావస్థకు చేరిన ఓవర్‌ హెడ్‌ ట్యాంకు విషయంలో భద్రతా చర్యలు చేపట్టి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. గడివేముల మండలం సోమాపురం గ్రామంలో ఇళ్లపైకి దిగువకు వచ్చిన విద్యుత్‌ తీగల సమస్యను పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ఆర్డీఎస్‌ఎప్‌ పథకం ద్వారా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గువ్వలకుంట-చిన్నపాలెం, సదరం చెరువు, ఎర్రగుడి చెరువు రహదారి పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆత్మకూరు నుంచి గువ్వలకుంట వరకు విద్యార్థుల రాకపోకల కోసంప్రత్యేక బస్సుసౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ... జిల్లాలో యూరియా కొరత లేకపోయినా వైసీపీ జడ్పీటీసీలు కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని అన్నారు. 2025 సంవత్సరకం కంటే 10 శాతం 2026లో ఎరువులు, విత్తనాలు, ఎరువుల సరఫరా అయినట్లు తెలిపారు. జిల్లాలో 25 వేల మంది కౌలు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 600 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. దీంతో కౌలు రైతులకు బ్యాంకుల్లో రుణాలు అందడం లేదని, అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పశ్చిమ ప్రాంత మండలాల్లో పదిరోజులకు ఒక్కసారి నీరు వస్తోందన్నారు. సీపీసీడబ్ల్యూ స్కీంల నిర్వహణకు కాంట్రాక్టర్లు 60 శాతం లెస్‌కు టెండర్లు వేస్తే పనులు ఎలా చేస్తారన్నారు. నిధులన్నీ నీటికోసమే ఖర్చుపెట్టాలన్నారు. ఆదోని-2 మండలానికి కేజీబీవీని మంజూరు చేయాలన్నారు.

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ... ఆలూరులో 15 రోజులకు ఒక్కసారి తాగునీరు సరఫరా అవుతున్నాయన్నారు. పైప్‌లైన్‌ ఏర్పాటు చేయకపోవడంతో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గజ్జహళ్లి వద్ద ఎస్‌ఎస్‌ ట్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ఖాజాపురం రిజర్వా యర్‌లో ఫిల్డర్‌బెడ్‌లు పనిచేయక పోవడంతో నీరంతా పచ్చగా వస్తున్నాయన్నారు. చెరువు నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఆలూరులో రూ.1.60 కోట్లతో నిర్మించిన ల్యాబ్‌ను ఆదోనికి తరలించడం అన్యాయమన్నారు.

ఎమ్మెల్సీ మధుసూదన్‌ మాట్లాడుతూ... పశ్చిమ ప్రాంతంలో యాప్‌పై అవగాహన లేని రైతులు అనేక మంది ఉన్నారని, వారికి అవగాహన కల్పించాలని కోరారు. యూరియా, డీఏపీలను రైతులందరికీ అందజేయాలన్నారు.

డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ... మార్క్‌ఫెడ్‌ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కందులు, జొన్నలు శనగలు కొనుగోలు చేస్తున్నామని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయానికి రావాల్సిన సెస్సును వసూలు చేయించి గ్రంథాలయాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని కలెక్టర్లను కోరారు. పంచాయితీల నుంచి రూ.5 కోట్లు, మున్సిపాలిటి, కార్పొరేషన్‌, నగర పంచాయితీ నుంచి రూ.12 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, బకాయిలు వసూలు చేస్తే ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్దికి మరింత కృషి చేసేందుకు అవకాశం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని, వాటిని గుర్తించి రద్దు చేసినట్లు తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 11:26 PM