Share News

సీటు ఇవ్వండి.. చదువుకుంటా సార్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:45 AM

స్కూల్లో సీటు ఇవ్వండి సార్‌.. చదువుకుంటా అని ఓ బాలిక గురువారం కోసిగి కస్తూర్బా బాలికల విద్యాలయం ముందు ఆదోళనకు దిగింది. కౌతాళం మండలం కరిణి గ్రామానికి చెందిన మహాదేవి, గోవిందు దంపతులు బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు.

సీటు ఇవ్వండి..  చదువుకుంటా సార్‌
తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలుపుతున్న శృతి

కోసిగి కస్తూర్బా స్కూల్‌ ముందు తల్లిదండ్రులతో కలిసి విద్యార్థిని ఆందోళన

కోసిగి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): స్కూల్లో సీటు ఇవ్వండి సార్‌.. చదువుకుంటా అని ఓ బాలిక గురువారం కోసిగి కస్తూర్బా బాలికల విద్యాలయం ముందు ఆదోళనకు దిగింది. కౌతాళం మండలం కరిణి గ్రామానికి చెందిన మహాదేవి, గోవిందు దంపతులు బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. తమలాగే తమ కుమార్తె శృతి భవిష్యత్‌ కూడా వలసపాలవ్వకూడదని, ఆమెను బాగా చదివించాలని ఆశపడ్డారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కస్తూర్బా విద్యాలయంలో ఆరో తరగతి సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మంత్రాలయం నియోజకవర్గంలోని మంత్రాలయం, కౌతాళం, కోసిగి మండలాల్లో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఇప్పటికే సీట్లన్నీ భర్తీ అయిపోయాయి. దీంతో శృతిని ఏ పాఠశాలలో కూడా చేర్చుకోలేదు. దీంతో శృతి, ఆమె తల్లదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ‘నాకు చదువుకోవాలని ఉంది సార్‌.. సీటు కేటాయించండి’ అంటూ బాలిక శృతి కస్తూర్బా స్కూల్‌ గేటు ముందు నిలబడి అధికారులను వేడుకుంది. ‘రెక్కాడితే గానీ డొక్కాడని వలస జీవులం సార్‌.... మా బతుకులు ఎలాగో ఇలాగే తెల్లారుతున్నాయి. మా బిడ్డనైనా బాగా చదివించుకుంటాం’ అని అని విన్నవించుకున్నారు. ఇలా అయితే తమలాంటి ఎంతోమంది వలస కూలీల పిల్లలకు చదువు ఎట్లా అబ్బుతుందని వాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ పేద బాలిక శృతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి, అదనపు సీట్ల కేటాయించి, సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:45 AM