Share News

సైకిళ్లు ఇప్పించండి.. బడికెళ్తాం సారూ..

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:17 AM

అదొక నల్లమల అటవీ సమీప గ్రామం. అత్యధికంగా చెంచు గిరిజనులు నివసిస్తున్న ఈ గ్రామంలో ఇప్పుడిప్పుడే విద్యాభివృద్ధి వికసిస్తోంది. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్స్‌ ఏమీ లేకుండా వంద శాతం విద్యార్థులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.

సైకిళ్లు ఇప్పించండి.. బడికెళ్తాం సారూ..
13ఏటిఎం3. వేడుకుంటున్న కొట్టాలచెరువు విద్యార్థులు

స్వగ్రామం నుంచి హైస్కూలుకు 7 కి.మీ.

బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఆటో ఖర్చులు భరించలేక తల్లిదండ్రుల వెనకడుగు

కొట్టాల చెరువు చెంచు విద్యార్థుల వ్యథ

ఆత్మకూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : అదొక నల్లమల అటవీ సమీప గ్రామం. అత్యధికంగా చెంచు గిరిజనులు నివసిస్తున్న ఈ గ్రామంలో ఇప్పుడిప్పుడే విద్యాభివృద్ధి వికసిస్తోంది. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్స్‌ ఏమీ లేకుండా వంద శాతం విద్యార్థులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే హైస్కూల్‌ విద్యను అభ్యసించే విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. మండలంలోని కొట్టాల చెరువు గ్రామానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థులు తమ గ్రామం నుంచి సుమారు 7 కిమీల దూరంలో ఉన్న కురుకుంద జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు వెళ్తున్నారు. అయితే గ్రామానికి సరైన ఆర్టీసీ రవాణా సదుపాయం లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించి బడికి వెళ్లాల్సి వస్తోంది. ఈ లెక్కన ప్రతిరోజూ రూ.30 నుంచి రూ.40 వరకు విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోంది. అసలే చెంచు గిరిజనులు కావడంతో సరైన జీవనోపాధులు లేక వారి పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ పిల్లలకు ఖర్చు చేసి బడికి పంపించే స్థోమత లేక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని హైస్కూల్‌కు సక్రమంగా పంపించడం లేదు. ఇదే అదునుగా కొందరు విద్యార్థులు బడికి డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. దీంతో గ్రామంలో వీరిని చూసిన ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్న పిల్లలు సైతం తాము కూడా బడికి వెళ్లమని మారాం చేస్తున్నారు. గిరిజన విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.. కనీసం జిల్లా కలెక్టర్‌ అయినా తమ ఇబ్బందులను గుర్తించి సైకిళ్లను ఇప్పిస్తే ప్రతిరోజు చక్కగా బడికి వెళ్తామని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:25 AM