ప్రాణాలతో చెలగాటం
ABN , Publish Date - May 18 , 2026 | 12:09 AM
జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
రోడ్డుపైకి ఫిట్‌నెస్ లేని ప్రైవేటు పాఠశాలల బస్సులు
జిల్లావ్యాప్తంగా 712 బస్సులకు గాను 425 వాహనాల తనిఖీ
300 బస్సులకు ఫిట్‌నెస్ లోపాలు
వివిధ ప్రైవేట్ విద్యాసంస్థలకు నోటీసులు
నంద్యాల, మే 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తిప్పుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 425 వాహనాలను తనిఖీ చేయగా.. 300 వాహనాల్లో ఫిట్‌నెస్ లోపాలున్నట్లు గుర్తించి పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఫిట్‌నెస్ లేకుండానే బస్సులు నడపడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిట్‌నెస్ లేకుండానే...
జిల్లా వ్యాప్తంగా 547 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అన్ని ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి 712 బస్సులు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో చాలా వరకు వివిధ రకాల ఫిట్‌నెస్ లేకుండానే ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తిప్పుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కనీసం డ్రైవర్లను నిబంధనలు ప్రకారం నియమించు కోలేదు. గతంలో అధికారుల తనిఖీల్లో నమోదు చేసిన కేసులే ఇందుకు నిదర్శనం
అధికారుల తనిఖీల్లో బట్టబయలు
ఇటీవల జిల్లా రవాణాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా బృందాలుగా ఏర్పడి ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన బస్సులను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ వరకు 425 బస్సులను తనిఖీ చేయగా.. 300 బస్సుల్లో వివిధ రకాల ఫిట్‌నెస్ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. తద్వారా ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్ గుట్టు బట్టబయలైంది. దీంతో వందల సంఖ్యలో బస్సులకు ఫిట్‌నెల్ లోపాలు ఉండటంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కంగు తిన్నట్లైంది. వెంటనే ఆయా 300 బస్సులకు చెందిన స్కూల్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అయితే మిగిలిన 287 బస్సులు కూడా ఈ ఆనెల ఆఖరులోపు ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు చూపించుకోవాల్సి ఉంది. స్కూల్స్ ప్రారంభమ య్యేలోపు ఫిట్‌నెస్ లేకుండా బస్సు తిప్పితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఏటీఎస్ కేంద్రాలపై విమర్శలు
గతంలో జిల్లా రవాణాశాఖ అధికారులు బస్సులను తనిఖీ చేసి ఫిట్‌నెస్ లేకుంటే వెనక్కి పంపేవారు. అధికారులతో పని లేకుండా (ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్) ఏటీఎస్ కేంద్రాల్లో ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్ నిర్వహిస్తున్నారు. సదరు నిర్వహణను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అయితే తాజా తనిఖీల్లో లోపాలు గుర్తించిన బస్సుల్లో కొన్నింటికి ఏటీఎస్ కేంద్రాల్లో ఫిట్‌నెస్ పొందిన బస్సులు కూడా ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ లెక్కన ప్రైవేట్ వ్యక్తులు ఏటీఎస్ కేంద్రాల్లో పక్కాగా ఫిట్‌నెస్ పరీక్ష చేస్తున్నారా..? లేక.. పైసలు తీసుకుని మమ అనిపిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. లోతుగా విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఫిట్‌నెస్ పరీక్ష ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా.. రవాణాశాఖ అధికారులు తనిఖీల సమయంలో ఫిట్‌నెస్ లేకుండా పట్టుబడితే జరిమానాలతో పాటు తగిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ : 547
ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన బస్సులు : 712
ఇప్పటి వరకు తనిఖీ చేసిన బస్సులు : 425
లోపాలు గుర్తించిన బస్సులు : 300
ప్రైవేట్ స్కూల్స్‌కు నోటీసులు జారీ చేసిన సంఖ్య : 300
ఫీజులపై ఉన్న ఆసక్తి ఫిట్‌నెస్‌పై ఏదీ?
ప్రైవేటు పాఠశాలల నిర్వాహ కులకు ఫీజులపై ఉన్న ఆసక్తి కనీస సౌకర్యాల కల్పన, బస్సుల ఫిట్‌నెస్‌పై లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తుం డడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు విద్యాశాఖ, రవాణాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫిట్‌నెస్ లేకుండా తప్పితే చర్యలు
ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన ప్రతి బస్సు ఫిట్‌నెస్‌తో ఉండాల్సిందే. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల శాఖ ఉన్నతాధికారుల అదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేశాం. లోపాలు గుర్తించిన బస్సులకు చెందిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశాం. ఫిట్‌నెస్ లేకుండా బస్సులు తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం.
శ్రీకాంత్, నంద్యాల ఆర్టీవో