ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళిక
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:21 PM
కూటమి ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో రాయలసీమతో పాటు ఇతర జిల్లాల్లో ఉద్యాన హబ్ పథకాన్ని అమలు చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
సీడ్ హబ్ పథకం ద్వారా 86,430 హెక్టార్లలో సాగు లక్ష్యం
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో రాయలసీమతో పాటు ఇతర జిల్లాల్లో ఉద్యాన హబ్ పథకాన్ని అమలు చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో నీటి వనరులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఉద్యాన పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనుంది. దాదాపు రూ.1,600 కోట్లతో 406 రైతు సేవా కేంద్రాల పరిధిలో 21 క్లస్టర్లను ఏర్పాటు చేసి 86,430.01 హెక్టార్లలో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పండ్లతోటల అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఉద్యాన హబ్ పథకం ద్వారా కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి తీసుకోబోయే చర్యలపై నివేదికను ఇటీవల జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి ప్రభుత్వానికి నివేదిక పంపారు.
21 క్లస్టర్ల ఏర్పాటు
కర్నూలు కేంద్రంగా కంబలపాడు, రామళ్లకోట, పెద్దటేకూరు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా కోడుమూరులో ప్యాలకుర్తి, ఓర్వకల్లు కేంద్రంగా పోలకల్లు, మంత్రాలయం కేంద్రంగా పెద్దకడుబూరు, చింతలకుంట, చెట్నెపల్లి క్లస్టర్లను గుర్తించారు. ఆదోని కేంద్రంగా హొళగుంద, కౌతాళం, ధనాపురం క్లస్టర్లను ఎమ్మిగనూరు కేంద్రంగా హెచ్. కైరవాడి, కడిమెట్ల, కనకవీడు, పత్తికొండ, రాతన,పెరవలి, క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఆలూరు కేంద్రంగా పెద్దహోతూరు, చిప్పగిరి, హాలహర్వి క్లస్టర్లను గుర్తించారు. ఈ 21 క్లస్టర్ల పరిధిలో 406 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. క్లస్టర్ల వారిగా ఏ ఏ ఉద్యాన పంటలు సాగు చేసిందీ ఆ గ్రామ క్లస్టర్లను గుర్తించామని, పూలతోటలు, పండ్లతోటలు, ఆకుకూరలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలను ఆ గ్రామాల్లోని నేల స్వభావాన్ని పట్టి ఎంపిక చేశామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలులోకి తెచ్చేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేస్తోందని ఈ పథకం అమలైతే కరువు సీమ రతనాల సీమగా మారే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యాన హబ్‌తో జిల్లాకు భారీగా నిధులు
సాధారణ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అందువల్లనే కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల కానున్నాయి.
-రాజా కృష్ణారెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి