ఓర్వకల్లులో పైలట్ శిక్షణ
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:00 AM
కర్నూలు కేంద్రంగా రాయలసీమ గగనతలంలో విమానయాన పైలట్ శిక్షణ ప్రారంభ మైంది. రాష్ట్రంలో తొలి డీజీసీఏ ఆమోదం పొందిన ‘ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో) ను ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ (ఓఎఫ్‌ఏఏ) ఓర్వకల్లు విమానాశ్రయం కేంద్రంగా ఏర్పాటు చేసింది. పైలట్ శిక్షణపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇక దూరప్రాంతాలకు వెళ్లనవసరం లేదు.
రాష్ట్రంలో తొలి ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ
డీజీసీఏ ఆమోదిత ప్రథమ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్
సీమ గగనతలంలో పైలట్ శిక్షణ
ఇప్పటికే డ్రోన్ సిటీ ఏర్పాటుకు శ్రీకారం
తాజాగా ఫ్లయింగ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, టీజీ, బీసీ
కర్నూలు కేంద్రంగా రాయలసీమ గగనతలంలో విమానయాన పైలట్ శిక్షణ ప్రారంభ మైంది. రాష్ట్రంలో తొలి డీజీసీఏ ఆమోదం పొందిన ‘ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో) ను ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ (ఓఎఫ్‌ఏఏ) ఓర్వకల్లు విమానాశ్రయం కేంద్రంగా ఏర్పాటు చేసింది. పైలట్ శిక్షణపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఇక దూరప్రాంతాలకు వెళ్లనవసరం లేదు. ఓర్వకల్లు విమానాశ్రయం కేంద్రంగా ఆధునిక విమానాలు, సిమ్యులేటర్లు, శిక్షణ పొందిన ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్లు, డీజీసీఏ ప్రమాణాలకు అనుగుణంగా అకాడమీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. శనివారం ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ కేంద్రం ఇది. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కఽథనం.
కర్నూలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు రాతి వనం (రాక్ గార్డెన్)గా ప్రసిద్ధి. చుట్టూ ఎటుచూసినా రాళ్లకుప్పలే. సాగుకు పనికిరాని భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. ఒకనాడు పనులు లేక పిల్లాజెల్లాతో వలసలు వెళ్లిన పల్లెసీమలు కలిగిన ప్రాంతం అది. రాష్ట్ర విభజన తరువాత ఓర్వకల్లు ముఖచిత్రం మారిపోయింది. అందుకు కారణం... వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండడమే. 2014లో లోటు బడ్జెట్‌తో అధికార పగ్గాలు చేపట్టిన సీఎం చంద్రబాబు కరువుసీమలో పారిశ్రామిక ప్రగతికి బీజం వేశారు. రాళ్లకుప్పగా మారిన ఓర్వకల్లు కేంద్రంగా పారిశ్రామికవాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఏపీఐఐసీ ఆధ్వరంలో మూడు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు రావాలంటే విమానయాన సౌకర్యం ఉండాలని సీఎం చంద్రబాబు తలంచారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2016 ఫిబ్రవరిలో కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం ఆమోదం సాధించారు. 2017 ఫిబ్రవరిలో ఓర్వకల్లు, పుడిచెర్ల, కన్నమడకల గ్రామాల్లో 1,010 ఎకరాల భూములు కేటాయించారు. రూ.110 కోట్లు నిధులు కేటాయించి ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ వినానాశ్రయం నిర్మాణానికి 2017 జూన్‌లో భూమి పూజ చేశారు. ఏడాదిన్నరలో పూర్తి చేసి 2019 జనవరి 8న జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.154 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం పౌర విమానాలు రాకపోకలతో సరిపుచ్చకుండా రాయలసీమ ప్రాంతంలో పైలట్ శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. అందులో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదంతో ప్రథమ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌ను (ఎఫ్‌టీవో)ను ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ (ఓఎ్‌ఫఏఏ) చేసింది. అంటే.. ఇక నుంచి కర్నూలు గగతనంలో శిక్షణ విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి.
పైలట్ శిక్షణకు సరికొత్త గమ్యం
దేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో వివిధ సంస్థల పైలట్ శిక్షణ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌లో బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల కేంద్రంగా తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ, ఏసియన్ పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ సంస్థలు పైలట్ శిక్షణలు ఇస్తున్నాయి. ఏపీలో ఈ పైలట్ శిక్షణ సంస్థలు ఇప్పటి వరకు లేవు. పైలట్ శిక్షణపై ఆసక్తి ఉన్న విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో డీజీసీఏ ఆమోదం, ప్రమాణాలతో కర్నూలు (ఓర్వకల్లు) కేంద్రంగా ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ (ఓఎఫ్‌ఏఏ) ఏర్పాటు చేసింది. రాయలసీమ జిల్లాల యువతకు పైలట్ శిక్షణకు ఇది సువర్ణ అవకాశమని పలువురు పేర్కొంటున్నారు. సురక్షితమైన విమాన శిక్షణ, ప్రాక్టికల్ అనుభవానికి ప్రాధాన్యత ఇస్తూ అకాడమీ శిక్షణా కార్యకలాపాలను రూపొందించింది.
ఒకే చోట.. పలు శిక్షణలు
ఓర్వకల్లు కేంద్రంగా ఓఎఫ్‌ఏఏ ఏర్పాటు చేసిన పైలట్ శిక్షణలో పలు కోర్సులు అందుబాటులోకి తీసుకురానుంది. స్టూడెంట్ పైలట్ లైసెన్స్ (ఎస్‌పీఎల్), ప్రైవేట్ పైలట్ లైసెన్స్ (పీపీఎల్), కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్), ఇన్‌స్ట్రుమెంట్ రేటింగ్ (ఆర్‌ఐ), మల్టీ ఇంజన్ శిక్షణ (ఎంఈ).. వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. సీపీఎల్‌లో ఐఆర్, ఎస్‌ఈతో పాటు ఐఆర్, ఎస్‌ఈ, ఎంఈ.. వంటి శిక్షణలను కూడా ఈ అకాడమీ అందిస్తుంది. ఓరియంట్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ సంస్థ ప్రస్తుతం చెన్నై, మైసూర్, డిల్లీ కేంద్రాల్లో పైలట్ శిక్షణ ఇస్తున్నారు. ఓర్వకల్లు కేంద్రంగా రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
సిమ్యులేటర్.. ఆధునిక విమానాలు
ఓర్వకల్లు విమానాశ్రయం కేంద్రంగా ఓఎఫ్‌ఏఏ ఏర్పాటు చేసిన పైలట్ శిక్షణలో సాంకేతికతకు పెద్దపీట వేయనున్నారు. అత్యాధునిక ఫ్లైట్ సిమ్యులేటర్లు, ఆధునిక తరగతి గదులు, శిక్షణ విమానాల సముదాయం ఏర్పాటు చేశారు. ఇన్‌స్ట్రుమెంట్, మల్టీ ఇంజిన్ శిక్షణకు సిమ్యులేటర్లను వినియోగించనున్నారు. ఈ కేంద్రంలో డీజీసీఏ గ్రౌండ్ స్కూల్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తరగతి గది బోధనతో పాటు ప్రత్యక్ష విమాన శిక్షణకు ప్రాధ్యానత ఇస్తారు. ధ్రువీకరించబడిన ఫ్టైట్ ఇన్‌స్ట్రక్టర్లు, అనుభవజ్ఞులైన విమానయాన నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.
సీమలో పైలట్ శిక్షణ అవకాశాలు
కర్నూలు కేంద్రంగా ఎఫ్‌టీవో ఏర్పాటు చేయడం కేవలం శిక్షణా కేంద్రానికే పరిమితం కాకుండా పాంత్రీయ విమానాయాన రంగానికి ఊతమిచ్చే అంశంగా పలువురు పేర్కొంటున్నారు. ఫైలట్ శిక్షణతో పాటు శిక్షకులు, సాంకేతిక సిబ్బంది, గ్రౌండ్ ఆపరేషన్, విమానయానానికి అనుబంధంగా సేవలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. అంతేకాదు.. రాయలసీమ ప్రాంతంలో పైలట్ శిక్షణ అవకాశాలు కూడా మెరుగుపడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
30 ఏళ్ల అనుభవం
పైలట్ శిక్షణలో ఓరియంట్ ఫ్టైల్ ఏవియేషన్ సంస్థకు 30 ఏళ్ల అనుభవం ఉందని తెలుస్తుంది. డీజీసీఏ అమోదం పొందిన చీఫ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ (సీఎఫ్‌ఐ), చీఫ్ గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్ (సీజీఐ) ఆధ్వర్యంలో శిక్షణ, సింగిల్ పిస్టన్ ఇంజన్ నుంచి టర్బోజెట్ విమానాల వరకు శిక్షణ అనుభవం కలిగిన నిపుణులు ఉన్నారు. వ్యక్తిగత శ్రద్ధ, అఽధునిక సదుపాయాలు ఉన్నాయి. సెస్నా 172, సెస్నా 152 వంటి శిక్షణ విమానాలతో పాటు మల్టీ ఇంజన్ శిక్షణ, అత్యాధునిక ఫ్లైట్ సిమ్యులేటర్ సదుపాయాలు ఈ కేంద్రంలో ఉన్నాయని ఏవియేషన్ నిపుణులు తెలుపుతున్నారు.
ఏవియేషన్ హబ్‌గా ఓర్వకల్లు
ఓర్వకల్లు కేంద్రంగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వివిధ రకాల డ్రోన్లతో పాటుగా భారత రక్షణ రంగం వినియోగించే డ్రోన్లను కూడా ఇక్కడే తయారు చేసేలా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా నవ్యాంధ్ర ముంగిట పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఓరియంట్ ఫ్టైట్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేసింది. ఓర్వకల్లుకు ఎఫ్‌టీవోల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఓర్వకల్లు ఏవియేషన్ హబ్‌గా ప్రగతి పథంలో దూసుకుపోతుందని, సీఎం చంద్రబాబు విజనే అందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఓర్వకల్లే ఎందుకుంటే..!
దక్షిణ భారతదేశానికి మధ్య ప్రాంతంలో కర్నూలు ఉండడం ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కలిసి వచ్చిన అంశమని ఏవియేషన్ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం విమానాల శిక్షణకు ఉంది. ఏడాది పొడువున శిక్షణ ఇచ్చేందుకు అనువుగా ఉందని అంటున్నారు. అంతేకాదు.. ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నై, తిరుపతి, బెంగళూరు, .. వంటి ప్రాంతాలకు రహదారి మార్గం అనుసంధానం వంటి అంశాలు ఎఫ్‌టీవో ఏర్పాటుకు దోహదం చేశాయి.