హమ్మయ్యా..!
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:29 PM
నెలరోజుల క్రితం కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
తల్లి చెంతకు చిన్నారి ప్రణవి
తప్పిపోయిన చిన్నారిని గుర్తించిన పోలీసులు
రంగంలోకి 200 మంది పోలీసులు
స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ సునీల్ షెరాన్
ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ముమ్మర గాలింపు
జొన్నచేనులో నిద్రపోయిన చిన్నారి
8 గంటల పాటు నంద్యాలలో ఉత్కంఠ
నెలరోజుల క్రితం కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సరిగ్గా అలాంటి సంఘటనే నంద్యాల పట్టణంలో కూడా చోటు చేసుకోవడంతో సర్వత్రా ఉత్కంఠకు దారి తీసింది. రాత్రి వేళ ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చిన చిన్నారి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఇంటిని గుర్తించలేకపోయిందో తెలీదుకాని.. బయటకు వచ్చిన చిన్నారి ప్రణవి కాలినడకన దారివెంట నడిచింది. చిమ్మ చీకటిలో కాలినడకన వెళ్లిన చిట్టితల్లి ప్రణవి నేరుగా సమీపంలోని పొలాల్లోకి వెళ్లిపోయింది. ఇంటికి దారి తెలియక చీకట్లో భయంతో గుక్కపట్టి ఏడుస్తూ.. ఆకలితో అలమటిస్తూ అలసిపోయిన ఆ బిడ్డ జొన్నచేనులో నిద్రలోకి జారుకుంది. అయితే చిట్టితల్లి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న పోలీ సులు అప్రమత్తమై తెల్లవార్లు జరిపిన కూంబింగ్‌లో సోమవారం ఉదయం తెల్లవారుజామున చిట్టితల్లిని నిద్రపోతున్న ప్రణవిని గుర్తించారు. రాత్రంతా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ సుస్మిత రామనాథన్, ఏఎస్పీ చిన్నికృష్ణ నేతృత్వంలో దాదాపు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది గాలింపు అనంతరం చిట్టితల్లి కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నంద్యాల క్రైం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాత్రి ఇంటి నుంచి వెళ్లిన చిన్నారి ప్రణవి కనిపించకుండా పోవడంతో కన్నతల్లి తల్లడిల్లిపోయింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే కళ్యాణి కుమార్తె ప్రణవితో కలసి ఒంటరిగా వైఎస్సార్ నగర్‌లో నివాసం ఉంటోంది. ఆదివారం డ్యూటీ లేకపోవడంతో ఇంటి చెంత ఉన్న ఓ దుకాణానికి వెళ్లింది. ఇంటికి వచ్చేసరికి కుమార్తె ప్రణవి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముందుగా కుటుంబ సభ్యులు కాలనీ మొత్తం వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు. తర్వాత రాత్రి 9 గంటలకు తల్లి కళ్యాణి డయల్-112కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తుని ఘటన జరిగిన క్రమంలో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ సుస్మిత రామనాథన్, ఏఎస్పీ చిన్నికృష్ణ, సీఐలు ఈశ్వరయ్య, సుధాకర్‌రెడ్డి, సురేష్‌బాబులతోపాటు ఎస్‌ఐలు, దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది కలిసి రాత్రి వైఎస్ నగర్, నందమూరినగర్‌లతోపాటు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. రెండు ప్రాంతాల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అనుమానాస్పద ఇళ్లలో సోదాలు చేశారు. తన కార్యాలయంలో కూర్చొని ఎస్పీ రాత్రంతా చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతోపాటు డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌ను వినియోగించి వైఎస్సార్ నగర్ వెలుపల ఉన్న కాలువలు, పంటలు, పరిసర ప్రాంతాలను వెతికారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు వైఎస్ నగర్, నందమూరినగర్ ప్రాంతాల్లో గాలింపు అనంతరం సమీప ప్రాంతాల్లో కూంబింగ్ ప్రారంభించారు. రెండు ప్రాంతాల్లోని పరిసరాలు, పక్కనే ఉన్న పంట పొలాలను చుట్టుముట్టి కూంబింగ్ చేపట్టారు. ప్రతి వీధిలోని సీసీటీవీ ఫుటేజీలన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ప్రణవి ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత చిన్నారి వెళ్లిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు చీకటి పడటంతో చిన్నారి ఆచూకీని కనుగొనేందుకు పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ రాత్రంతా పోలీసులు టార్చిలైట్లు వేసుకుని గాలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మరింత బలగాలను మోహరించారు. ఈ క్రమంలో సమీపంలోని పొలాల్లో కూంబింగ్ చేపట్టారు. అయితే కాలనీకి కొద్ది దూరంలో ఉన్న జొన్న చేనులో చిన్నారి ప్రణవి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు గుర్తించారు. చిన్నారి రాత్రంతా భయంతో గుక్కపట్టి ఏడుస్తూ, అలసిపోయి నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఉదయం పోలీసు అధికారుల సమక్షంలో చిన్నారి ప్రణవిని కన్నతల్లి కళ్యాణికి సిబ్బంది అప్పగిస్తున్న క్షణంలో స్థానికులతో పాటు పోలీసుల మోములో ఆనందం పెల్లుబికింది. దాదాపు ఎనిమిది గంటలపాటు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, ప్రజలను ఉత్కంఠకు గురిచేసిన ఈ కేసును తెల్లవారేలోగా ఛేదించిన జిల్లా పోలీసులను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటన జిల్లా పోలీసు యంత్రాంగం తలెత్తుకునేలా చేసింది.
పోలీసులకు ఎస్పీ ప్రశంసలు
సమాచారం అందుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తప్పిపోయిన చిన్నారి ప్రణవిని తల్లి ఒడికి చేర్చిన పోలీసులను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 ద్వారా వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని సురక్షితంగా గుర్తించగలిగారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజల భద్రత, రక్షణ కోసం నంద్యాల జిల్లా పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తారన్నారు. గాలింపు చర్యల్తో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.