Share News

పెట్రో కష్టాలు ప్రజా తిప్పలు..!

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:48 PM

‘జిల్లాలో ఎక్కడా పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా అవసరానికి మించి ఇంధనం ఉంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు.

పెట్రో కష్టాలు ప్రజా తిప్పలు..!

కలెక్టర్‌, జేసీల ఆదేశాలు బేఖాతర్‌

క్యాన్లలో ఇష్టానుసారంగా ఇంధనం

రాత్రి ఫుల్‌.. ఉదయం నో స్టాక్‌

రెండు గంటల్లోపే బంకులు ఖాళీ

కొరత లేదంటున్న కలెక్టర్‌

గంటల పాటు క్యూలైన్లలో వినియోగదారులు

పరిష్కారంలో జిల్లా యంత్రాంగం విఫలం

‘జిల్లాలో ఎక్కడా పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. జిల్లా వ్యాప్తంగా అవసరానికి మించి ఇంధనం ఉంది. ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. ఎవరూ అపోహలు నమ్మకండి. అధికంగా కొనుగోలు చేసి పెట్రోల్‌ను నిల్వ చేసుకోకండి. పెట్రోల్‌, డీజిల్‌ను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం..’

- కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి

పెట్రోల్‌ కోసం పడిగాపులు

నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉంది. స్టాక్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియడం లేదు. రాత్రి, పగలు పెట్రోల్‌ కోసం ఎదురు చూడడమే పని అయిపోయింది. అధికారులేమో జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ స్టాక్‌ కొరత లేదని చెబుతున్నారు. కానీ పెట్రోల్‌ బంకులలో నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. ఎంత స్టాక్‌ ఉంది.. ఎంత స్టాక్‌ లేదు.. పెట్రోల్‌ బంకు యాజమాన్యాలు చెప్పడం లేదు. కనీసం డిస్‌ప్లే కూడా చేయడం లేదు.

- రాజు, కర్నూలు

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఏసీ గదుల్లో కూర్చొని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, జిల్లా స్థాయి అధికారులు చేస్తున్న ప్రకటనలకు... మండుటెండలో గంటల పాటు నిలబడి పెట్రోల్‌ కోసం ప్రయాస పడుతున్న సామాన్యుడి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా పెట్రోల్‌ కొరత లేదని, పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయని, ఎవరూ భయపడవద్దని ఏకంగా కలెక్టర్‌ విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వెల్లడించారు. పెట్రోల్‌ కొరత లేకపోతే ఇలా గంటల తరబడి క్యూలో మండుటెండలో నిలబడాల్సిన అవసరం తమకేం ఉందంటూ సామాన్య వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్య ఒక్కటే కానీ అధికారుల మాటలకు, సామాన్యుల ఆవేదనకు ఎంతో తేడా ఉంది. జిల్లా స్థాయి అధికారులు చెప్పే లెక్కలకు, ప్రజలు పడే అవస్థలకు ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. ఏది ఏమైనా సామాన్యుడు మాత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెట్రోల్‌, డీజిల్‌ కోసం పడే నరకయాతన వాస్తవం. మండుటెండలో గంటల తరబడి ఇంధనం కోసం ఎదురుచూడటం మాత్రం పచ్చినిజం. ‘పలానా బంకులో పెట్రోల్‌ ఉందంట..’ అన్న సమాచారం రాగానే మధ్యతరగతి ప్రజలు అర్ధరాత్రి అని కూడా లెక్కచేయకుండా పరుగులు తీస్తున్నారు. ఓ వైపు ప్రజల అవస్థలు ఇలా ఉంటే.. మరో వైపు బ్లాక్‌ మార్కెట్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లా స్థాయి అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించకుండానే ఏసీ గదుల్లో కూర్చొని ‘పెట్రోల్‌ కొరత లేదంటూ..’ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.

వచ్చిన స్టాక్‌ వచ్చినట్టే క్లియర్‌

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాహనదారులు, క్యూలైన్‌లలో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఉదయం పెట్రోల్‌ బంకులలో నోస్టాక్‌ అని దర్శనం ఇస్తున్నాయి. రాత్రి వేళలో మాత్రమే స్టాక్‌ రావడంతో కేవలం 2గంటలు మాత్రమే మొత్తం స్టాక్‌ అయిపోతోంది. రాత్రి సమయాల్లో ఆయిల్‌ ట్యాంకర్లు రావడంతో పెట్రోల్‌ బంకు సమీపాన రహదారులు రద్దీని తలపిస్తున్నాయి. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ పెట్రోల్‌, డీజిల్‌లను టిన్నులు, డబ్బాలు, క్యాన్లలో నింపకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ పెట్రోల్‌ బంకు యాజమాన్యాలు మాత్రం కలెక్టర్‌, జేసీల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. వాటర్‌ క్యాన్లు, టిన్నులకు ఎంతకావాలంటే అంత పెట్రోల్‌, డీజిల్‌ను వేస్తున్నారు. ఇలా చేయడంతో వచ్చిన ట్యాంకర్లు కేవలం 2 గంటల వ్యవధిలోపు స్టాక్‌ ఖాళీ అవుతున్నాయి.

సూచికలు లేవు

పెట్రోల్‌ బంకుల్లో స్టాక్‌ ఎంత ఉందన్న కనీస సమాచారం బహిరంగంగా చెప్పడం లేదు. కొన్ని పెట్రోల్‌ బంకులు యాజమాన్యాలు పెట్రోల్‌, డీజిల్‌ ఉన్నా కూడా వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. కనీసం స్టాక్‌ విషయం కూడా ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదు. ఓ వైపు స్టాక్‌ లేదంటూనే.. మరో వైపు క్యాన్లతో వచ్చిన ఆటోల్లో నింపి పంపిస్తున్నారు. అలా బల్క్‌గా నింపిన క్యాన్లన్నీ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని పెట్రోల్‌ బంకుల వద్ద బం దోబస్తుగా ఏర్పాటుచేసిన పోలీస్‌ కానిస్టేబుళ్లు తమ స్నేహితులు, తెలిసిన వాళ్లకు సమాచారం ఇస్తూ వాహనాలు, క్యాన్లకు పెట్రోల్‌ నింపిస్తున్నారు. పోలీసులు కావడంతో సామాన్య ప్రజలు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు.

చేతులెత్తేసిన అధికారులు

జిల్లాలో పెట్రోల్‌ బంకులపై పర్యవేక్షణ కరువైంది. దీంతో రాత్రివేళలో వచ్చిన స్టాక్‌ను టిన్నులు, చిన్న చిన్న ట్యాంకుల ద్వారా గ్రామాల్లోకి సరఫరా అవుతోంది. గ్రామాల్లో లీటర్‌పై అదనంగా రూ.50 నుంచి రూ.100 దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. పెట్రోల్‌ బంకులపై తహసీల్దార్లు, సివిల్‌ సప్లైస్‌ అధికారులు తనిఖీలు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మీడియా ద్వారా వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని ఆ పెట్రోల్‌ బంకులపై అధికారులు తనిఖీలు చేసి మమ.. అనిపిస్తున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. దాదాపు 3 రోజులకు సరిపడా అదనంగా పెట్రోల్‌, డీజిల్‌ ఉంది. పెట్రోల్‌ యాజమాన్యాలు ఇంధనం కొరత సృష్టిస్తే ఆ పెట్రోల్‌ బంకు యజమానులపై చర్యలు తీసుకుంటాం. వాటర్‌ టిన్నులు, డబ్బాల్లో పెట్రోల్‌, డీజిల్‌ వేయరాదు. అలా చేస్తే కచ్చితంగా ఆ పెట్రోల్‌ బంకును సీజ్‌ చేస్తాం.

- రాజా రఘువీర్‌, డీఎ్‌సవో, కర్నూలు

Updated Date - Apr 26 , 2026 | 11:48 PM