Share News

పేదలపై పెట్రో బాంబ్‌..!

ABN , Publish Date - May 16 , 2026 | 12:25 AM

పెట్రోల్‌, డీజిల్‌ పొదుపు పాటించాలి..! హైదరాబాద్‌ సభలో ప్రధాని మోడీ చేసిన సూచన ఇది. ఎప్పుడైనా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం అదే జరిగింది.

పేదలపై పెట్రో బాంబ్‌..!
పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ కోసం స్కూటరిస్టులు బారులు

పెరిగిన ఇంధన ధరలు

లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంపు

వినియోగదారులపై రోజుకు రూ.కోట్లు అదనపు భారం

నిత్యావసర సరుకుల ధరలపై తీవ్ర ప్రభావం

పెట్రోల్‌, డీజిల్‌ పొదుపు పాటించాలి..! హైదరాబాద్‌ సభలో ప్రధాని మోడీ చేసిన సూచన ఇది. ఎప్పుడైనా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం అదే జరిగింది. లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంచింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా చమురు కంపెనీలు నష్టాలు చవి చూస్తున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని ముందే నిపుణులు అంచనా వేశారు. చమురు ఽధరలు పెరగడంతో జిల్లా ప్రజలపై ప్రత్యక్షంగా నెలకు రూ.5.46 కోట్లు సామాన్యులపై భారం తప్పదు. నిత్యావసర సరుకులు, నిర్మాణ రంగ వస్తువులు ధరలు భారీగా పెరిగి.. పరోక్షంగా రూ.వందల కోట్లు భారం మోయాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

కర్నూలు, మే 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు చెందిన 58, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)కు చెందిన 52, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చెందిన 30, ప్రైవేట్‌ రంగ సంస్థలు నయారా సంస్థలకు చెందిన 22, జీయో కంపెనీ నాలుగు కలిపి జిల్లాలో 166 ఫిల్లింగ్‌ స్టేషన్లు (పెట్రోల్‌ బంకులు) ఉన్నాయి. ఏపీ పౌర సరఫరాల శాఖ లెక్కలు ప్రకారం కర్నూలు జిల్లాలో రోజుకు 2.50 లక్షల లీటర్లు పెట్రోల్‌, 3.18 లక్షల లీటర్లు డీజిల్‌ వినియోగం ఉంది. గురువారం వరకు లీటరు పెట్రోల్‌ రూ.109.51, డీజిల్‌ రూ.97.36లకు విక్రయించారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్‌ బంకుల్లో ధరల పట్టిక మారిపోయింది. కర్నూలు నగరంలో లీటరు పెట్రోల్‌ రూ.113.31, డీజీల్‌ రూ.100.98, ఎమ్మిగనూరు పట్టణంలో పెట్రోల్‌ రూ.112.59, డీజిల్‌ రూ.100.50 చొప్పున విక్రయాలు జరిగాయి. అంటే.. లీటరుపై పెట్రోల్‌పై రూ.3.29-3.80, డీజిల్‌ రూ.3.14-3.65 వరకు పెరిగింది. రవాణా దూరాన్ని బట్టి పెరుగుదల కొంత అటుఇటూ ఉంటుంది. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం 5.68 లక్షల లీటర్లు ఉంది. ఈ లెక్కన పెరిగిన ధరల ప్రకారం జిల్లా వాహన వినియోదారులపై రోజుకు రూ.18.20 లక్షలు చొప్పున నెలకు రూ.5.46 కోట్లు అదనపు భారం తప్పడం లేదు. పెట్రో ధరలపై సామాన్యులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్‌ వాణిజ్య సీలండర్ల ధరలను భారీగా పెంచారు. ఇది చాలదన్నట్లు పెట్రో మోతతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు.

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ఆ ప్రభావం రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బియ్యం, పప్పు, వంటనూనే.. వంటి నిత్యవస సరుకుల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం కుదేలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధం సిమెంట్‌ బస్తాపై రూ.20-30 వరకు పెంచారు. స్టీల్‌ టన్నుపై రూ.7-8 వేలకు పైగా పెరిగింది. గ్రానైట్‌, టైల్స్‌.. వంటి ధరలు కూడా తారస్థాయికి చేరాయి. తాజాగా డీజిల్‌ ధరలు పెరగడంతో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా కంపెనీలు ఇప్పటికే డీలర్లకు సమాచారం ఇచ్చారు. అదే జరిగితే నిర్మాణం రంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం లేకపోలేదని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

నెలకు రూ.వెయ్యి అదనపు భారం

ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం మాలాంటి సామాన్యులకు తీవ్ర నష్టం తప్పదు. ప్రస్తుతం రోజుకు దాదాపు పది లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నారు. పెరిగిన ధరల వల్ల నెలకు రూ.900 నుంచి వెయ్యి వరకు అదనపు భారం భరించాల్సి వస్తుంది. ఆటో చార్జీలు పెంచితే ప్రయాణీకులు రారు. ప్రభుత్వం పునరాలోచించి పెంచిన ధరలు తగ్గించాలి.

- సాదిక్‌బాషా, ఆటో డ్రైవర్‌, ఆదోని

ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేయాలి

పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో బైక్‌ బయటకు తీయాలంటేనే భయమేస్తుంది. ఒక్కసారిగా లీటరుపై రూ.3.24 పెంచడం దారుణం. రవాణా భారమవుతుంది. తర్వారా నిత్యవసర సరుకుల కూడా పెరుగుతాయి. సామాన్యుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి.

- ప్రసాద్‌, ఆదోని

Updated Date - May 16 , 2026 | 12:25 AM