పెట్రోల్, డీజిల్ కొరత
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:03 AM
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా జిల్లాలోని కొన్ని పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందుల్లో ఎమ్మిగనూరు వినియోగదారులు
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా జిల్లాలోని కొన్ని పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిలువలు లేకపోవటంతో రోజూ కొద్దిసేపు మాత్రమే తెరిచి మిగతాసమయాల్లో మూసివేస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో అయితే పూర్తి గా మూసివేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో 16 పెట్రో లు బంకులు ఉండగా సోమవారం ఉదయం 5 బంకు లు మూతపడగా సాయంత్రానికి మరిన్ని బంకులు మూతపడ్డాయి. జియో బంకుల్లో మాత్రమే స్టాక్ ఉన్నా వహనదారులు ఎగబడటంతో నిర్వాహకులు పెట్రోల్ సరఫరాను నిలిపివేశారు. మంగళవారం కొన్ని బంకులకు స్టాక్ రానున్నట్లు యజమానులు చెబుతున్నారు.
కోసిగిలోనూ...
కోసిగి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండల కేంద్రంలోని మూడు ప్రధాన పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో యజమాన్యాలు చేతులెత్తేసి బంకులను మూసేసి నోస్టాక్ బోర్డులు పెట్టేశారు. రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేక మూసివేయడంతో వాహనదారులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదోని రోడ్డులోని ఇండియన్ ఆయిల్, ఎమ్మిగనూరు రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంకు, ఉరకుంద రోడ్డులోని నయారా పెట్రోల్ బంకులో నిల్వ లేకపోవడంతో నోస్టాక్ బోర్డు పెట్టడంతో వాహనదారులను ఇబ్బందులు పడ్డారు. అక్రమ నిల్వదారులు లీటర్ పెట్రోల్‌ను రూ.150 దాకా అమ్ముతున్నారు.