అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:22 PM
: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు కనీసం 95 శాతం వరకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు కనీసం 95 శాతం వరకు నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను కేవలం ముగించడమే కాకుండా సమస్య మూలాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడం ముఖ్యమన్నారు. ప్రీ-ఆడిట్ ప్రక్రియలో భాగంగా జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన మొత్తం 42,258 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. అందులో 30,798 అర్జీలను ప్రీ- ఆడిట్ చేయగా, వాటిలో 27,365 అర్జీలకు సరైన విధంగా పరిష్కారం చూపినట్లు వెల్లడించారు. అయితే 3,433 అర్జీల్లో లోపాలున్నట్లు గుర్తించబడినట్లు పేర్కొన్నారు. ఈ లోపాలను తగ్గించి పరిష్కారాల నాణ్యతను మరింత మెరుగుపరచాలన్నారు. అర్జీదారుల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో విశేషంగా పనిచేసిన 10 మంది అధికారులను అభినందించారు. అలాగే అర్జీలను నిర్లక్ష్యంగా పరిష్కరించిన లేదా సరైన విధంగా స్పందించని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారిని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 296 అర్జీలు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 164 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. జేసీ కార్తీక్, డీఆర్వో రామునాయక్, నోడల్ అధికారి ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
పోషణ పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి
పోషణ పక్షోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యం, పోషణపై విస్తృత అవగాహన కల్పిం చాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో పోషణ పక్షోత్సవాలకు సంబంధించిన గోడప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా పిల్లల ఆరోగ్యం, పోషణ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు.