ఖరీఫ్‌కు సమృద్ధిగా ఎరువులు
ABN , Publish Date - May 19 , 2026 | 12:30 AM
ఈసారి ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం సమృద్ధిగా ఎరువులున్నాయి.
ఈ సంవత్సరం 2,70,000 మెట్రిక్ టన్నుల ఎరువులు
పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి
కర్నూలు అగ్రికల్చర్, మే 18 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం సమృద్ధిగా ఎరువులున్నాయి. ముఖ్యంగా యూరియా, డీఏపీ, పొటాష్ తదితర ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందకుండా ఉండేందుకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈసారి ఖరీ్‌ఫలో యూరియా 58,872 మెట్రిక్ టన్నులను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డీఏపీ వచ్చే ఖరీ్‌ఫలో 15,408 మెట్రిక్ టన్నులను రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు ఈసారి ఖరీ్‌ఫలో 1,28,013 మెట్రిక్ టన్నులు అందించాలని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఖరీ్‌ఫలో 2,70,000 మెట్రిక్ టన్నులు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. యూరియా వాడకాన్ని తగ్గించేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోనున్నారు. రైతులకు ఎక్కువ మొత్తంలో యూరియాను అందించకుండా పంటకు అవసరమయ్యే యూరియాను మాత్రమే రైతుకు అందించేలా చర్యలు చేపట్టను న్నారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీ, బయో ఫర్టిలైజర్లు, సేంద్రియ ఎరువులను రైతులకు అలవాటు చేసేందుకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. సేంద్రియ ఎరువులతో పాటు ఎఫ్‌వైఎం, వర్మి కంపోస్టు, గ్రీన్ మ్యాన్యుర్ పంటలు, బయో ఫర్టిలైజర్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
ప్రత్యేక చర్యలు చేపట్టాం
ఈసారి ఖరీ్‌ఫలో రైతులకు అవసరం మేరకు యూరియా, డీఏపీ కాంప్లెక్స్ ఎరువులను ఎటువంటి లోటు లేకుండా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఫిబ్రవరి నుంచి మే వరకు కొంత మంది డీలర్లు యూరియాను దుర్వినియోగం చేసినట్లు నిర్దారించి జిల్లాలో 15మంది డీలర్ల లైసెన్సులను రద్దు చేశాం. ఎవరైనా ఎరువులను పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - వరలక్ష్మి, జేడీ, కర్నూలు