పారదర్శకంగా ఎరువుల పంపిణీ
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:01 AM
ఎరువుల పంపిణీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఏఐఎమ్‌ఎస్-2.0 యాప్‌ను విజయవంతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
ఆదోని అగ్రికల్చర్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఎరువుల పంపిణీ మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఏఐఎమ్‌ఎస్-2.0 యాప్‌ను విజయవంతంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. బుధవారం ఆయన ఎరువుల దుకాణాలలో ప్రభుత్వం రూపొందించిన ఏపీఎఐఎంఎస్- 2.0 ద్వారా జరుగుతున్న ఎరువుల క్రయవిక్రయాలపై తనిఖీలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో యాప్ పనితీరుపై రైతులను, దుకాణ యజమాని అశోకనందరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. యాప్‌లో సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా, డీఏపీ అందించాలన్నారు. బసాపురం గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు తన కుమార్తెకు గ్రామంలో పొలం ఉందని, తెలంగాణ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశామన్నారు. ఆధార్ కార్డు అక్కడ ఉండడంతో ఎరువులు ఇక్కడ పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కౌలుదారుగా గుర్తించి ఎరువులు అందజేస్తామని తెలిపారు. ఆదోని రెవిన్యూ డివిజన్ కావడంతో నాలుగు నియోజకవర్గాలకు చెందిన రైతులు ఇక్కడికి ఎరువుల కోసం వస్తున్నారని దుకాణదారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆదోని మండలానికి మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని అధికంగా కేటాయిస్తూ రైతులు ఆర్‌ఎ్‌సకేలలో మ్యాపింగ్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవన్నారు. పొరపాట్లు లేకుండా చూస్తామని తెలిపారు. ఆయన వెంట ఏడీఏ బాలవర్ధిని రాజు, ఏవో సుధాకర్, ఏఈవో సతీష్ ఉన్నారు.