వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:16 AM
కళ్లలో కారం కొట్టి.. కత్తులతో దాడి చేసి ఓవ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉయ్యాలవాడ మండలం ఆర్.పంపల్లె గ్రామ సమీపంలో చోటుచేసుకు న్నట్లు పోలీసులు తెలిపారు
అనుమానితుడిని చితకబాదిన మృతుడి కుటుంబసభ్యులు
ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత
స్తంభించిన ట్రాఫిక్.. ఆందోళన చెందిన ప్రజలు
మృతదేహాన్ని నంద్యాలకు తరలించిన పోలీసులు
ఆళ్లగడ్డ/ఉయ్యాలవాడ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కళ్లలో కారం కొట్టి.. కత్తులతో దాడి చేసి ఓవ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉయ్యాలవాడ మండలం ఆర్.పంపల్లె గ్రామ సమీపంలో చోటుచేసుకు న్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటకి చెందిన మిద్దె నాగార్జున(35) శుక్రవారం సాయంత్రం అనంతపురం జిల్లా యాడికి తన ట్రాక్టర్ డ్రైవర్ ఓబులేసుతో కలిసి బైక్‌పై బయలు దేరాడు. గుర్తుతెలియని దుండగులు వెంబడించి ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో బైకును అడ్డగించారు. నాగార్జున కళ్లలో కారం కొట్టి వెంటాడి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపారు. కాగా అతడి వెంట ఉన్న ఓబులేసు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. శనివారం కొందరు ప్రయాణికులు రోడ్డుపై పడి ఉన్న నాగార్జున బైక్‌ను చూసి ఓ రైతు పొలంలో శవమై పడి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచార మిచ్చారు. వారు అక్కడికి చేరుకొని విచారించి మృతుడి బంధువులకు సమాచారం అందిం చారు. నాగార్జున వెంట ఉన్న ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఐ బీవిరమణ, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, చాగలమర్రి ఎస్‌ఐలు కేసును విచారిస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి అలియాస్ గంగాదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
వెంబడించి రోడ్డుపై చితకబాదారు
ఆళ్లగడ్డలోని ప్రభుత్వాస్పత్రికి నాగార్జున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తీసుకొచ్చారు. ఈ హత్యకేసులో మృతుడి కుటుంబీకులు అనుమానితుడిగా భావిస్తున్న పి.చింతకుంటకి చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి తన వాహనంలో అటుగా వెళ్తున్నాడు. మృతుడి భార్య గంగమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు అతడు కనిపించాడు. ఆస్పత్రి నుంచి వారు రాఘవేంద్రను కొద్ది దూరం వెంబడించారు. వాహనంలో నుంచి కిందికి లాగి నడి రోడ్డుపై చితకబాదారు. ఆక్కడ ఉద్రిక్త పరిస్థితులతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకొని రాఘవేంద్రను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాగార్జున కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట కొద్ది సేపు బైఠాయించారు. పరిస్ధితి విషమించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు తరలించారు.
గొంతు కోసి వ్యక్తి హత్య
ఆదోని, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పదునైన వస్తువుతో ఓ వ్యక్తిని గొంతు కోసి దుండుగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదోనిలోని అమరావతినగర్‌లో శనివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఆలూరు మండలం అరికెరకి చెందిన వీరేష్(30) శనివారం అమరావతినగర్‌లోని తన అత్తారింటికి వచ్చాడు. ఇంటి నుంచి బయటకొచ్చిన వీరే్‌షను దుండగులు మాట కలిపి పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్యచేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమా చారమిచ్చారు. డీఎస్పీ వెంకటరమణ, వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ ఘటనాస్థలికి పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు గల కారణాలపై పలుకోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ వెంకటరమణ తెలి పారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా? కుటుంబ కలహాలా? అనే కోణాల్లో విచారణ చేపడుతున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.