Share News

శాశ్వత వసతులకే ప్రాధాన్యత

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:08 PM

శ్రీశైలంలో భక్తుల రద్దీకి తగినట్లు శాశ్వత వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉందని, ఈ సమస్యకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు వెల్లడించారు.

శాశ్వత వసతులకే ప్రాధాన్యత
సమావేశంలో పాల్గొన్న సభ్యులు

శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ రమేష్‌నాయుడు

పాలకమండలి సమావేశంలో మాస్టర్‌ ప్లాన్‌పై సుదీర్ఘ చర్చ

శ్రీశైలం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో భక్తుల రద్దీకి తగినట్లు శాశ్వత వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉందని, ఈ సమస్యకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు వెల్లడించారు. బుధవారం పరిపాలనా భవనంలో ట్రస్ట్‌బోర్డు ఛైర్మెన్‌ అధ్యక్షతన 5వ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు ఈవో శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన విభాగపు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌నాయుడు మాట్లాడుతూ క్షేత్రాభివృద్ధికి చేపట్టే అభివృద్ధి పనులు భక్తులకు ఉపయుక్తంగా ఉండాలేకాని దేవస్థానం నిధులు దుర్వినియోగమయ్యేలా ఉండకూడదనాన్నరు. ప్రతి పని శాశ్వత వసతుల కల్పన దిశగా ప్రణాళికలు రూపొందించి అమలుపరిచేందుకే ట్రస్ట్‌బోర్డు కృషి చేస్తుందని అన్నారు. 30 సంవత్సరాల వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి మాస్టర్‌ప్లాన్‌ డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర పరిధిలోని ప్రధాన కూడళ్లలో శాశ్వత శౌచాలయాలు, డార్మిటరీల నిర్మాణం, వాహనాల పార్కింగ్‌ వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా మాస్టర్‌ప్లాన్‌ ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణతోపాటు మల్లమ్మ కన్నీరు ఆలయం వద్ద గల పురాతన కాలభైరవ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులకు అందజేసే కైలాస కంకణాలు, మురుగునీటి శుద్ధి వంటి పలు పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు ఆమోదం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

శివయ్యా చూస్తున్నావా...

మార్చి 16వ తేదిన ఆంధ్రజ్యోతిలో తలనీలాల టెండర్లో గూడుపుఠాణి అనే శీర్షికతో ప్రచురితమైన ప్రత్యేక కథనం వల్ల దేవస్థానం ఆదాయం మరో రూ. 50 లక్షలు పెరిగింది. గత ప్రభుత్వం 7.30 కోట్ల రూపాయలకు ఇచ్చిన టెండర్‌తో నష్టపోయినందున ఈ ప్రభుత్వం కేవలం 4.15 కోట్ల రూపాయలకు ఈ టెండర్‌ను మరో వ్యక్తికి కట్టబెట్టింది. దేవస్థానంలో మొక్కుల రూపంలో తలనీలాల సమర్పణ పెరుగుతుండటంతో ఆమేరకు ప్రస్తుత టెండరుదారుడ్ని పెంచమని ఆలయ అధికారులు ఆదేశించారు. టెండరుదారు ప్రస్తుతం రూ. 5.10,99,399కు పెంచుతూ మరో రూ. 50 లక్షలు దేవస్థానానికి చెల్లించేందుకు అంగీకరించారు. దీనికి ట్రస్ట్‌బోర్డు ఆమోదించినట్లు ధర్మకర్తల మండలి తెలిపింది.

Updated Date - Mar 25 , 2026 | 11:08 PM