నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్ల శాతం
ABN , Publish Date - May 23 , 2026 | 11:29 PM
రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తుందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ణయానికి కృషి చేస్తున్నాం
డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
కర్నూలు ఎడ్యుకేషన్, మే 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తుందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై వివిధ బీసీ కుల సంఘాలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజల నుంచి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం కోసం జిల్లాల పర్యటన చేపట్టినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న జనాభా గణాంకాలు, గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించే ప్రక్రియలో ఖచ్చితమైన జనాభా అంచనా అత్యంత కీలకమని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. బీసీల జనాభా అంచనాకు రెండు ప్రధాన అంశాలను పరిశీలిస్తుందన్నారు. ఒకటి బీసీల సామాజిక వెనుకబాటు, రెండోది వారి జనాభా శాతం అని వివరించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వంటి ఎన్నికల యూనిట్‌లో ఎంత శాతం స్థానాలు బీసీలకు రిజర్వు చేయాలనే విషయంపై కమిషన్ సిఫారసు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేల నాణ్యత ఖచ్చితత్వం అత్యంత కీలకమన్నారు. కులగణనతో పాటు ప్రస్తుతం జరుగుతున్న యూనిఫైడ్ ప్యామిలీ సర్వే ఆధారంగా వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. కలెక్టర్ డా.ఏ. సిరి మాట్లాడుతూ 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాడర్లలో వివిధ కీలక శాఖలలో విశిష్ట సేవలు అందించారని వివరించారు. మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ హౌసింగ్, ఇరిగేషన్ వంటి ప్రధాన విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో కూడా ఆయన విశేష పాత్ర పోషించారని కలెక్టర్ తెలిపారు. బీసీ వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై కమిటీకి సమగ్ర వివరాలు అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కుల సంఘాలు, సామాజిక సంస్థలు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వినతులను స్వీకరించారు. ఈ సమావేశంలో కమిషన్ సెక్రటరీ రాజు, డీఆర్వో సీ.వెంకటనారా యణమ్మ, జడ్పీ సీఈవో రమణారెడ్డి, సీసీవో భారతి, మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ లోక్‌రాజ్, వివిధ బీసీ కుల కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.