ప్రజల్లో చైతన్యం రావాలి
ABN , Publish Date - May 30 , 2026 | 11:36 PM
పరిశుభ్రతపై ప్రజల్లో విప్లవాత్మక మార్పు రావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ సీడీఎంఏ పి.సంపత్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
అందుకే ‘ఆపరేషన్ క్లీన్‌స్వీప్’
మున్సిపల్ శాఖ సీడీఎంఏ పి.సంపత్‌కుమార్
కర్నూలు న్యూసిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతపై ప్రజల్లో విప్లవాత్మక మార్పు రావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ సీడీఎంఏ పి.సంపత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. శనివారం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా ఏ.క్యాంపు అశ్వినీ ఆసుపత్రి సమీపంలో డ్రైనేజీ కాలువ, గణే్‌షనగర్-శ్రీరామ్‌నగర్ ప్రాంతాల్లోని సుద్దవాగులో పూడికతీత పారిశుధ్య పనులను కలెక్టర్ సిరి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీడీఎంఏ సంపత్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాలుగు వారాల పాటు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం ఉంటే నగరాలు ఎంతో పరిశుభ్రంగా మారగలవో ప్రత్యక్షంగా చూపించడమే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ లక్ష్యమన్నారు. పరిశుభ్రతలో స్థానిక సంస్థల పాత్ర 80 శాతం ఉంటే మిగిలిన 20 శాతం ప్రజల భాగస్వామ్యమే కీలకమన్నారు. కర్నూలులో కేసీ కాలువకు పూర్వవైభవం తీసుకురావడంలో నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు చొరవను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో పరిశుభ్రత పట్ల మరింత అవగాహన పెంచుతాయన్నారు. కలెక్టర్ సిరి మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే లక్షల టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా గణనీయంగా తగ్గిచగలిగామని తెలిపారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. హంద్రీ నది శుభ్రత కార్యక్రమానికి మున్సిపల్ శాఖ సహకారం అందించాలని కోరారు. ప్రజల బాగస్వామ్యం, చైతన్యం ఉంటేనే పరిశుభ్రమైన నగరాన్ని నిర్మించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ సతీష్ కుమార్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఎస్‌ఈ జే.రమణమూర్తి, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు పాల్గొన్నారు.